వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. తమ పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నందునే తమ పార్టీ అధ్యక్షుడి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేశానని ఆయన చెబుతున్నారు. జగన్మోహన్రెడ్డి 11 సీబీఐ ఛార్జిషీట్లలో ఏ-1గా ఉన్నారని.. పలు పనులతో కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని రఘురామకృష్ణరాజు అంటున్నారు. తన వాదనకు మద్దతుగా ఆయన మహారాష్ట్ర హోంమంత్రి దేశ్ ముఖ్ ఉదంతాన్ని చూపిస్తున్నారు. రూ వంద కోట్ల లంచం ఆరోపణలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ హైకోర్టు ఆదేశించిన వెంటనే ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఇప్పుడు.. అదే పద్దతిలో జగన్ కూడా… పదవిలో ఉండటానికి అర్హుడు కాదన్నట్లుగా రఘురామకృష్ణరాజు వాదిస్తున్నారు. అదే సమయంలో… అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారందరికీ పదవులు కేటాయిస్తూ.. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తున్నారని కూడా.. రఘురామరాజు చెబుతున్నారు. కోర్టులో ఇదే విషయాన్ని హైలెట్ చేస్తానంటున్నారు. రఘురామకృష్ణరాజు నిజంగానే బెయిల్ రద్దు పిటిషన్ దాఖలు చేసి ఉంటే.. అది సంచలనాత్మక విషయం అవుతుంది.
ఒక్క జగన్ అక్రమాస్తుల కేసులోనే కాదు.. రఘురామకృష్ణరాజు.. వివేకా కేసులోనూ అదే దూకుడు చూపిస్తున్నారు. అందరికీ ఉన్న అనుమానాలు సీబీఐకి ఎందుకు రావడం లేదన్న విషయాన్ని పరోక్షంగా ప్రజల్లోకి పంపుతున్నారు. ఎవరిని ప్రశ్నిస్తే.. అసలు విషయం బయటకు వస్తుందో.. కూడా చెబుతున్నారు. వివేకాను గొడ్డలి పోటు పొడిచింది ఎవరు? కట్లు కట్టింది ఎవరు.. ? హత్య సమాచారం రాగానే అక్కడి సీఐతో ఎంపీ ఏం మాట్లాడారు? సీబీఐ అధికారులతో ఓ ఎంపీ వీడియో కార్ఫరెన్స్‌లో ఏం మాట్లాడారు? ఇలాంటివన్నీ తేలాల్సి ఉందన్నారు. మొదటగా హత్య విషయం తెలిసినప్పటికీ.. గుండెపోటుగా ప్రచారం చేశారని.. ఆ గుండె పోటు స్కెచ్ ఎవరితో విజయసాయిరెడ్డిని పోలీస్ స్టైల్లో ప్రశ్నిస్తే విషయం తేలిపోతుందని రఘురామరాజు సూచిస్తున్నారు. దీన్ని తాను ఇంతటితో వదిలి పెట్టబోనని.. పార్లమెంట్లో కూడా వివేకా హత్య విషయం ప్రస్తావిస్తానని చెప్పుకొచ్చారు.
రఘురామకృష్ణరాజుపై వైసీపీ అంతర్గతంగా దాడిని ముమ్మరం చేసింది. ఆయన ఆర్థిక అవకతవకలపై ఎక్కడికక్కడ కేసులు పెట్టించేందుకు పలుకుబడి అంతా ఉపయోగిస్తోందని రఘురామరాజు నమ్ముతున్నారు. ఎన్సీఎల్టీలో ఉన్న కేసుల్లోనూ సీబీఐకి బ్యాంక్ అధికారులతో ఫిర్యాదు చేయిస్తున్నారని.. ఇప్పుడు తమిళనాడు విద్యుత్ శాఖతోనూ కేసులు పెట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రఘురామరాజు నమ్ముతున్నారు. దానికి కౌంటర్‌గా జగన్ కేసుల్ని ఆయన మరింత దూకుడుగా న్యాయస్థానాల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది.