అరుకు వైకాపా ఎంపి కొత్తపల్లి గీతకి ఊరట లభించింది. హైకోర్టు ఆదేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పరిశీలన కమిటీ ఆమె షెడ్యూల్ తెగలకి చెందిన వాల్మీకి వర్గానికి చెందినవారేనని దృవీకరించింది. ఆమె షెడ్యూల్డ్ తెగకి చెందనప్పటికీ, అబద్దం చెప్పి ఎన్నికలలో ఎంపిగా గెలిచారని, కనుక ఆమె ఎన్నికని రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలయింది. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఆమె కులాన్ని దృవీకరించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించడంతో జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో జిల్లాస్థాయిలో సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఆమె దళితవర్గానికి చెందిన వ్యక్తేనని దృవీకరించింది. కనుక ఆమెపై వేసిన కేసుని హైకోర్టు కొట్టివేయవచ్చు.
వైకాపాకి చెందిన ఎంపిపై హైకోర్టు వేటు వేసే అవకాశం ఉన్నప్పుడు, తెదేపా ప్రభుత్వం ఆమె కోసం ఎందుకు ఇంత శ్రమ తీసుకొందంటే ఆమె వైకాపాని వీడి తెదేపాతో కలిసి తిరుగుతున్నందునేనని భావించవలసి ఉంటుంది. ఒకవేళ ఆమె వైకాపాలోనే ఉండి ఉంటే ప్రభుత్వం పట్టించుకోనేదే కాదని ఎవరైనా చెప్పగలరు. ఆమె తెదేపాలో చేరినట్లయితే అనర్హత వెటుపడే అవకాశం ఉంది కనుక ఆమె ఇంతవరకు తెదేపాలో చేరకుండా దానికి అనుబంధ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. అందుకే తెదేపా ప్రభుత్వం ఆమెని ఈ సమస్య నుంచి ఒడ్డున పడేసి ఉండవచ్చు.