తెలంగాణ నుంచి ఆర్.కృష్ణయ్య అనే నేతను తీసుకు వచ్చి ఏపీ నుంచి రాజ్యసభకు పంపారు సీఎం జగన్ రెడ్డి. కానీ ఆయన మొదట టీడీపీ.. తర్వాత కాంగ్రెస్.. తర్వాత వైసీపీ.. ఇప్పుడు ఏపీలో వైసీపీ.. తెలంగాణలో కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. బీసీ ఉద్యమ నేతగా తనను తాను ప్రకటించుకునే కృష్ణయ్య.. బీసీ ఉద్యమాలను రాజకీయాలకు తాకట్టు పెట్టేసి చాలా కాలం అయింది. ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నారు.
కాంగ్రెస్ పార్టీ నేషనల్ స్ట్రాటజీలో భాగంగా .. బీసీలను దగ్గరకు తీసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా బీసీ జనగణన చేపట్టాలన్న డిమాండ్ కు మద్దతు పలికింది. అందుకే ఇలాంటి డిమాండ్లు వినిపిస్తున్న బీసీ ఉద్యమ నేతలు అన్న పేరు ఉన్న వారందర్నీ కలిసి.. పరిచయాలు పెంచుకుంటోంది. కృష్ణయ్య కూడా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలను.. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ థాక్రేను ఇంటికి పిలిచారు. సన్మానం చేశారు. ఒకే పార్టీ నేతలం అన్నట్లుగా మాట్లాడారు.
కృష్ణయ్య తీరు చూసి వైసీపీ నేతలకు షాక్ కొట్టినట్లయింది. ఎందుకంటే.. వైసీపీ రాజ్యసభ సభ్యుడు అదీ కూడా జగన్ రెడ్డి ఏరికోరి ఎంపిక చేసిన ఎంపీ ఇలా కాంగ్రెస్ నేతలతో ములాఖత్ అయ్యారని తెలిస్తే బీజేపీ పెద్దలు ఇది జగన్ ఆడుతున్న మైండ్ గేమేమో అన్న అనుమానపిడతే మొదటికే మోసం వస్తుంది.
ఏపీకి వచ్చి జగన్ చెప్పినట్లుగా చేసి.. జగన్ ను సంఘ సంస్కర్త అని పొగిడేసి వెళ్లిపోతారు. తెలంగాణకు వెళ్లి తన రాజకీయాలు తాను చేసుకుంటున్నారు.