వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టారు. ఆయన ఏపీలో అడుగు పెడితే దాడులు చేస్తారని.. పోలీసులు అరెస్ట్ చేస్తారన్న ప్రచారాల మధ్య ఆయన చాలా కాలంగా ఢిల్లీలో ఉంటున్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా ఆయన హైదరాబాద్ నివాసానికి వస్తే అంతకు మించిచాన్స్ లేదన్నట్లుగా పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తీసుకెళ్లారు. ఆక్కడ ఆయనపై ధర్డ్ డిగ్రీ ప్రయోగించారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కూడా రావడం లేదు. అమరావతి రైతులకు మద్దతు తెలుపుతున్న తిరుపతి సభలో పాల్గొంటానని ప్రకటించారు.
అయితే తాను వస్తే చెవిరెడ్డి, పెద్ది రెడ్డి వంటి వైసీపీ నేతలు దాడులు చేయిస్తారని అందుకే వర్చువల్గా పాల్గొంటానని గురువారం ప్రకటించారు. కానీ అనూహ్యంగా రఘురామకృష్ణరాజు తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు. ఢిల్లీ నుంచి వచ్చిన తిరుపతి విమానంలో ఆయన కూడా వచ్చారు. ఆయన రాక గురించి అతి కొద్ది మంది జేఏసీ నేతలకే సమాచారం ఉంది. అమరావతి మహోద్యమ వేదికపై అన్నిపార్టీల నేతలు ఉన్నారు. అమరావతిని వ్యతిరేకిస్తున్న ఒక్క వైఎస్ఆర్సీపీ నేతలు మాత్రమే లేదు. ఆ లోటును ఎంపీ రఘురామకృష్ణరాజు భర్తీ చేశారు. ఆయన రాకతో అధికారికంగా వైసీపీ ఎంపీ కూడాఉన్నట్లయింది.
దీంతో అమరావతి వేదికపై అన్ని పార్టీల నేతలు ఉన్నట్లయింది. రఘురామరాజు వ్యూహం వైసీపీ నేతలను కూడా ఇబ్బంది పెడుతోంది. ఆయన రారు అనుకున్నారు కానీ సరైన సమయంలో వచ్చి వైసీపీని ఇబ్బంది పెట్టారని భావిస్తున్నారు. సమయం చూసి వైసీపీని ఎంపీ ఇక్కట్లలో పెట్టారని వైసీపీ నేతలు చర్చించుకుంటున్నారు. అమరావతిసభకు చంద్రబాబు సహా మిగిలిన పార్టీల ముఖ్య నేతలంతా హాజరయ్యారు.ఓ రకంగా అన్ని పార్టీలు,.. ప్రజాసంఘాల ఏకాభిప్రాయం అమరావతికి ఉన్నట్లుగా స్పష్టమయింది.