బెంగళూరు యలహంక ప్యాలెస్ లో వైసీపీ అధినేత జగన్ కాంగ్రెస్ నేతలతో భేటీ అయ్యారు అని జోరుగా ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని అందులో భాగంగానే కన్నడనాట కాంగ్రెస్ ముఖ్య నేతలతో సమావేశం అయ్యారనేది ఈ భేటీ సారాంశంగా తెలుస్తోంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో టీడీపీ భాగస్వామిగా ఉండటంతో జగన్ కు కమలదళం నుంచి ఆశించిన సహకారం దక్కడం లేదు. పైగా అక్రమాస్తుల కేసులో అరెస్ట్ జరిగితే బీజేపీ నుంచి మద్దతు లభించే అవకాశం లేదన్నది ఓపెన్ సీక్రెట్. దాంతోనే జగన్ ఇండియా కూటమికి చేరువ అవుతున్నారని ఓ వైపు ఉదృతంగా ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ రాహుల్ గాంధీపై ప్రశంసల జల్లు కురిపించడం ఆసక్తికరంగా మారింది.
రాహుల్ గాంధీ కుల గణన అనే అంశాన్ని ఎత్తుకోవడం సాంఘీక విప్లవానికి నాంది అని ఆకాశానికి ఎత్తేయడం హాట్ టాపిక్ అవుతోంది. జగన్ అడుగులు, ఆలోచనను గమనించే వైసీపీ రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య ఈ కామెంట్స్ చేశారని అంటున్నారు. అయితే , ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వ్యక్తిగతంగా చేశారా? లేక వ్యూహమా? యాదృచ్ఛికమా అనే చర్చ జరుగుతోంది.
జగన్ ఇండియా కూటమి వైపు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రచారం నేపథ్యంలోనే.. ఆర్ కృష్ణయ్య రాహుల్ పై ప్రశంసల జల్లు కురిపించడం గమనార్హం.