జగన్ రెడ్డిని సంఘ సంస్కర్త అంటూ.. ఏపీకి ఎప్పుడూ వచ్చినా జగన్ను నోరారా పొగిడే రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య.. తన సంస్కర్తకు షాక్ ఇచ్చారు. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. సైలెంట్ గా జరిగిపోయిన వ్యవహారంలో రాజ్యసభ చైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదించేశారు కూడా. దీంతో వైసీపీ రాజ్యసభ స్థానాల సంఖ్య ఎనిమిదికి పడిపోయింది. మరికొంత మంది లైన్లో ఉన్నారని చెబుతున్నారు.
తెలంగాణకు చెందిన ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వాలని జగన్ కు ఎందుకు అనిపించిందో కానీ.. రెండేళ్ల కింట రాజ్యసభ స్థానాలు భర్తీ చేసేటప్పుడు పిలిపించి మరీ పదవి ఇచ్చారు. తన పార్టీలో చాలా మంది బీసీ నేతుల చూస్తున్నా పట్టించుకోలేదు. ఏదో బలమైన సిఫారసు పని చేసి ఉంటుందని అనుకున్నారు. ఆ తర్వాత కృష్ణయ్య.. చుట్టపు చూపుగా ఏపీకి వచ్చి జగన్ ను మునగచెట్టు ఎక్కించేలా పొగిడి పోతూండేవారు. తెలంగాణలో రాజకీయాలు భిన్నంగా చేసేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో .. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతిచ్చారు.
అయితే ఇప్పుడు ఆయన బీజేపీలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజీనామా చేసిన సీటును.. ఆయనకే ఇస్తామని హామీ ఇవ్వడంతో రాజీనామాకు సిద్ధపడినట్లుగా చెబుతున్నారు. పూర్తి స్థాయి చర్చల తర్వాతనే ఆయన రాజీనామా చేశారని చెబుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఇంకా పరిమళ్ నత్వానీతో పాటు నిరంజన్ రెడ్డి అనే లాయర్ ను రాజ్యసభ సభ్యులుగా చేశారు. వీరిద్దరూ ఏపీకి చెందని వారు. మిగిలిన ఎంపీల్లో ఎక్కువ మంది పక్క చూపులు చూస్తున్నారని చెబుతున్నారు.