వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో వ్యక్తిగత వైరం పెట్టుకున్నట్లుగా రాజకీయాలు చేస్తున్నారు. మొదట్లో ఆయన సీఎం జగన్‌ను ఏమీ అనే వారు కాదు… అంతా ఆయన పక్కన ఉన్న సలహాదారులు చేస్తున్నారని…వారి పనులను సీఎం కరెక్ట్ చేసుకోవాలని సలహాలిచ్చేవారు.అయితే ఇప్పుడు హఠాత్తుగా రూటు మార్చారు. సీఎం జగన్‌ను టార్గెట్ చేసుకున్నారు. ఎంతగా అంటే.. సీఎం జగన్ బెయిల్ రద్దు చేయించే వరకూ తాను ఏపీ గడప తొక్కబోనని ప్రకటించారు. తనకు పిలిచి పార్టీ టిక్కెట్ ఇచ్చి ఎంపీని చేసిన జగన్ పట్ల.. రఘురామరాజుకు ఎందుకు అసంతృప్తి పెరిగింది.. అది వ్యక్తిగత వైరం స్థాయికి ఎందుకు తీసుకెళ్తున్నారనేది చాలా మందికి అర్థం కాని అంశంగా మారింది.
సీఎం జగన్ రాముడో.. రావణుడో తేల్చేదాకా ఏపీకి రానని రఘురామ శపథం చేశారు. నిజానికి ఆయన వైసీపీతో విబేధించినప్పటి నుంచి నర్సాపురం వెళ్లడం లేదు. దానికి కారణాలు కూడా ఆయనే చెబుతూ వస్తున్నారు. తనపై దాడులు చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపిస్తూ.. కేంద్రం నుంచి సెక్యూరిటీ తీసుకున్నారు. మరో సారి అరెస్టు కోసం దొంగ కేసులు పెట్టారని కోర్టుల నుంచి రక్షణ పొందారు. ఇప్పుడు..సీఎం జగన్ బెయిల్ రద్దు చేయించేవరకూ వెళ్లనని పట్టుబట్టారు. ప్రతీ సారి ఆయన జగన్మోహన్ రెడ్డి తీరుపై విమర్శలు చేస్తున్నారు. వివేకానందరెడ్డిని చంపినట్లే..తనను చంపడానికి జగన్ ప్లాన్ చేస్తున్నారని.. తనకు ప్రాణహాని ఉందని రఘురామరాజు నేరుగా ప్రధానికే లేఖ రాశారు. పార్లమెంట్‌లోనూ ప్రస్తావిస్తానంటున్నారు.
రఘురామరాజు ఆందోళన ఆషామాషీ కాదు.నిజంగానే వైసీపీతో విబేధించిన వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయో ఆయనకు స్పష్టత ఉందికాబట్టి.. జరిగింది ఎప్పటికప్పుడు తెలుసుకుని పోరాడుతున్నారు. నిజానికి చాలా మంది నోరు తెరవడానికి కూడా భయపడుతున్నసమయంలో.. రఘురామరాజు భయపడుతున్నట్లుగా వ్యాఖ్యలు చేస్తున్నారు కానీ… ఆయన పోరాడుతున్నారు. రఘురామరాజు ..నర్సాపురం వస్తే అరెస్ట్ చేయడానికి నిజంగానే కేసులు పెట్టారు. ఏపీలో ఇష్టం లేని వారిని అరెస్ట్ చేయడానికి నేరాలు చేసి ఉండాల్సిన పని లేదు. ఎవరో ఒకరు ఇచ్చే ఫిర్యాదుతో ముందుగా పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. తర్వాతి సంగతి తర్వాత అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు..జగన్ బెయిల్ రద్దు పిటిషన్ వేయడంతో.. మరింత వైల్డ్‌గా తనపై దాడి ప్రయత్నాలు చేస్తున్నారని రఘురామరాజు ఆరోపిస్తున్నారు. ఇది మరింత తీవ్రమైన ఆరోపణలుగా మారాయి. వ్యక్తిగత వైరంగా మారిపోయింది.
రఘురామరాజు ఎవరో కాదు… వైఎస్ ఆత్మ కేవీపీ వియ్యంకుడు. ఈ కారణంగానే జగన్‌తో మొదట్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కానీ జగన్ తీరు వేరు. ఆయన తన ముందు ఎవరూ కూర్చోడానికి కూడా అంగీకరించరు. కానీ రఘురామరాజు ఆత్మగౌరవం ఉన్న వ్యక్తి. ఆయనకు తన స్థాయి గౌరవం తనకు దక్కాలనుకుంటారు. మొదటి సారి పార్టీలో ఉన్నప్పుడు అదే జరిగింది… రెండో సారి పార్టీలో ఉన్నప్పుడూ అదే జరిగింది. ఇప్పుడు ఆ ఈగో ప్రాబ్లమ్స్ ఇద్దరి మధ్య..అంతకంతకూ పెరిగి… వ్యక్తిగత వైరం వరకూ వెళ్లింది. ఇది ముందు ముందు ఎలాంటి పరిస్థితికి దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.