నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు .. వైసీపీకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూండటంతో.. ఆయనపై… ఆ పార్టీ ట్రేడ్ మార్క్ దాడులు జరుగుతున్నాయి. అవి భౌతికంగా ఉండవు. దిష్టిబొమ్మలు దహనం చేయడం.. ఇష్టా రీతిన తిట్ల వర్షం కురిపించడం.. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం చేయడం వంటి వాటితో కూడి ఉంటాయి. ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా టీం.. రఘురామకృష్ణంరాజును కూడా టార్గెట్‌గా పెట్టుకుంది. వీటిని ఆయన పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. స్క్రీన్ షాట్లు.,.. వీడియోల రికార్డుతో.. తన పర్సనల్ సెక్రటరీని పోలీస్ స్టేషన్‌కు పంపి ఫిర్యాదు చేయించారు. అయితే..పోలీసులు మాత్రం.. ఆ ఫిర్యాదును లైట్ తీసుకున్నారు. పట్టించుకోవడం మానేశారు. దాంతో ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ అయిన తన ఫిర్యాదునే పోలీసులు పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కానీ రఘురామకృష్ణంరాజు కాస్త లోతుగా ఆలోచిస్తే.. పోలీసుల పనితీరును ఆయన సులువుగానే అంచనా వేసుకోగలరని చెబుతున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి… ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు పేరుతో ఫేక్ ట్వీట్లను.. మార్ఫింగ్ ట్వీట్లను.. ఫోటోలను సర్క్యులేట్ చేయడం దగ్గర్నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై బూతులతో దాడి చేయడం వరకు అధికార పార్టీ సోషల్ మీడియా చాలా చేసింది. వీటిపై.. కొన్ని వందలు.. వేల ఫిర్యాదులు… ఏపీ పోలీసులకు వెళ్లి ఉంటాయి. కానీ ఒక్కరంటే.. ఒక్కరిపైనా కేసు పెట్టడం కాదు కదా.. కనీసం చర్యలు తీసుకోలేదు పోలీసులు. అదే సమయంలో.. ప్రత్యేకంగా సీఐడీ ఓ ఫోన్ నెంబర్ కేటాయించింది.. ఆ ఫోన్ నెంబర్ వైసీపీ కార్యకర్తల కోసమే అన్నట్లుగా వారు చేసిన ఫిర్యాదులపై మాత్రం స్పందించడం ప్రారంభించారు.
అయితే.. రఘురామకృష్ణంరాజు ఇప్పటికీ వైసీపీ నేతనే.. ఆ పార్టీకి చెందిన ఎంపీనే. ఆయన హైకమాండ్‌పై ధిక్కరణ వ్యాఖ్యలు చేయకుండా ఉంటే.. ఆయన చేసే ఫిర్యాదులను పోలీసులు టాప్ ప్రయారిటీగా తీసుకునేవారు. అందులో సందేహం లేదు. ఇప్పుడు ఆయన పార్టీని ధిక్కరిస్తున్నారు కాబట్టి… ఆయనను పోలీసులు ప్రతిపక్ష ఖాతాలో వేసేశారు. అంటే… ఏపీలో ప్రతిపక్ష నేతలకు చట్టపరమైన హక్కులు లభించవన్నమాట. ఆ లెక్కలో రఘురామకృష్ణంరాజుకు కూడా దక్కవు. అదేంటి అని అడగలేరు.. ఎందుకంటే… ఏపీలో అంతే..! ఈ విషయం రఘురామకృష్ణంరాజుకు ఇప్పుడు క్లారిటీ వచ్చేసి ఉంటుంది.