విజయసాయిరెడ్డి మీడియా చానల్ పెడతానని ప్రకటించారు. దానికి కారణంగా ఆయన రామోజీరావును చూపించారు. కానీ అదంతా నమ్మశక్యంగా లేదు. ప్రెస్ మీట్లోనే… చంద్రబాబును, టీడీపీని సాక్షి మీడియా అనుకున్నంత గట్టిగా తిట్టడం లేదని అందుకే తాను చానల్ పెడుతున్నానని చెప్పుకొచ్చారు. మైకుల ముందే విజయసాయిరెడ్డి ఇలా అనడంతో అసలు విషయం అదా అని.. జనానికి ఓ క్లారిటీ వచ్చింది. విజయసాయిరెడ్డికి.. వైసీపీ హైకమాండ్‌కు ఈ మధ్య గ్యాప్ బాగా పెరిగింది. ఆయనపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా వైసీపీ నేతలు స్పందించడం లేదు సరి కదా.. సాక్షి పత్రికలోనూ ఎలాంటి కౌంటర్లు రాలేదు.
దీంతో విజయసాయిరెడ్డి నొచ్చుకున్నారు. ఈనాడులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న వార్త వచ్చినా సాక్షి పేజీలకు పేజీలు కౌంటర్లు ఇస్తుంది. అందులో సంబంధం లేని అన్ని అంశాలను ప్రస్తావిస్తుంది. విజయసాయిరెడ్డి కూడా తనను సాక్షి మీడియా డిఫెండ్ చేస్తుందని మూడు రోజులపాటు ఎదురు చూశాడు. డిఫెండ్ చేయడానికి అవసరం అయిన సమాచారం అంతా సాక్షి ఎడిటోరియల్ స్టాఫ్‌కు పంపారు.కానీ అటు వైపు నుంచి స్పందన లేదు. దీంతో మూడు రోజులు చూసి తానే మీడియా ముందుకు వచ్చారు. చివరికి తాను మీడియా చానల్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇది ఈటీవీ కన్నా.. సాక్షికే పోటీ అయ్యే అవకాశాలున్నాయి.
టీవీ చానళ్లలో ఈటీవీ న్యూస్ ఎక్కడో ఉంటుంది. వెదికి పట్టుకోవాలి. నెంబర్ వన్..టు… ఇలా చాలా వరకూ చానళ్లు వైసీపీ అనుకూలమే. రామోజీపై పగ తీర్చుకోవాలనుకుంటే పత్రిక పెట్టాలి. ఎందుకంటే ఈనాడు నెంబర్ వన్ లో ఉంది. అయితే పోటీగా టీవీ చానల్ పెడతానని చెప్పడమే అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. సాక్షి ఎలాగూ తనను కాపాడదని.. తానే టీవీ చానల్ పెట్టుకోవాలని ఆయన డిసైడయ్యారు.