వైసీపీ ఎంపీలు త్వరలోనే బీజేపీలో చేరనున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆస్తులను కాపాడుకునేందుకు, కేసుల నుంచి రక్షణ పొందేందుకు బీజేపీలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని విస్తృత ప్రచారం జరుగుతోంది. స్వయంగా బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఈ విషయాన్ని చెప్పిన రెండు రోజుల తర్వాత వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈ వార్తను కొట్టిపారేశారు. అంటే , ఆయన బీజేపీలో చేరేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతోనే కాస్త ఆలస్యంగా స్పందించారనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి.
పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వైసీపీ ఎంపీలు ఇంకా బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఢిల్లీలో తమకున్న పరిచయాలతో పార్టీలో చేరిక కోసం లాబీయింగ్ చేస్తున్నారన్న కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు ఈ వార్తలను ఖండించారు. వైసీపీ ఎంపీలను బీజేపీలో చేర్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నిప్పు లేకుండా పొగ రాదన్నది సుస్పష్టం.ఈ లెక్కన చూస్తే వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని స్పష్టం అవుతోంది.
సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని విమర్శలను మూటగట్టుకున్నారు. అలాంటి నేతే ఇప్పుడు వైసీపీ ఎంపీలకు డోర్లు క్లోజ్ చేశామని చెప్తున్నారంటే..ఆ పార్టీ ఎంపీలను బీజేపీలో చేర్చుకోవడం కష్టమేనని అంటున్నారు. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో రాష్ట్రం నుంచి వైసీపీ నేతల చేరికల విషయంలో బీజేపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. దాంతోనే బీజేపీలో చేరాలనే వైసీపీ ఎంపీలకు నిరాశే ఎదురు అవుతుందని అంటున్నారు.