ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విభజన సందర్భంగా ఇచ్చిన కొన్ని హామీలలో నెరవేర్చనివాటిలో విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కూడా ఒకటి. ప్రత్యేక హోదాకి 14వ ఆర్ధిక సంఘం పేరు చెప్పి ఏవిధంగా కేంద్రం తప్పించుకొంటోందో, రైల్వే రైల్వే జోన్ కి దాని కోసం వేసిన కమిటీ పరిశీలన పేరు చెప్పి తప్పించుకొంటోంది. కానీ అసలు కారణం వేరే ఉంది. ఓడిశా ప్రభుత్వం అందుకు అభ్యంతరాలు చెప్పడమే అందుకు అసలు కారణం. విశాఖ డివిజన్ ద్వారా ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ కి చాలా భారీ ఆదాయం వస్తోంది. కనుక దానిని వదులుకోవడానికి అది ఇష్టపడటం లేదు. అందుకే కమిటీ పరిశీలనలో దానిని కేంద్రం మగ్గబెడుతోంది. వైకాపా ఎంపిలు నిన్న రైల్వే మంత్రి సురేష్ ప్రభుని కలిసి తక్షణమే రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని కోరారు. వైకాపా ఎంపిలు తమతో బాటు తెదేపా ఎంపిలను కూడా తీసుకుపోయుంటే ఆయనపై ఒత్తిడి పెరిగి ఉండేది. కానీ ఆ రెండు పార్టీలు ఉప్పు, నిప్పులాగ ఉంటాయి కనుక ఎవరి ప్రయత్నాలు వారివే, ఎవరి ఉద్యమం వారిదే.
ఆంధ్రా ఎంపిలు పార్టీలు వారిగా చీలిపోవడం చేత అందరూ కలిసి గట్టిగా ఒత్తిడి చేయడం లేదు. మరొక పార్టీ ఎంపిలతో కలిసి వెళ్లి ఒత్తిడి చేస్తే ఆ క్రెడిట్ ఆ పార్టీకి ఎక్కడికి వెళ్ళిపోతుందో అనే భయం, ఆలోచనే తప్ప తమ అనైక్యత, అశ్రద్ధ వలన రాష్ట్రానికి తీవ్ర నష్టం కలుగుతోందనే ఆలోచన వారిలో కనబడటం లేదు. హోదా, రైల్వే జోన్ కోసం రాష్ట్రంలో జరిగిన, జరుగబోయే ఉద్యమాలను గమనిస్తే ఆ సంగతి స్పష్టంగా అర్ధమవుతుంది.
రాష్ట్రంలో మొదట కాంగ్రెస్ పార్టీ హోదా కోసం హడావుడి చేసింది కానీ దానిని ప్రజలు కూడా నమ్మడం లేదు కనుక ఎవరూ పట్టించుకోలేదని సరిపెట్టుకోవచ్చు. ఆ తరువాత నటుడు శివాజీ ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసారు. ఆయనకి వామపక్షాలు, ప్రజా సంఘాలు తప్ప మరే రాజకీయ పార్టీ మద్దతు ఇవ్వలేదు.
“వాళ్ళు పోరాడలేదు…వీళ్ళు సరిగ్గా పోరాడటం లేదు..” అంటూ అందరినీ విమర్శించే పవన్ కళ్యాణ్ కూడా శివాజీతో కలిసి ఉద్యమించక పోయినా కనీసం ఆయన పోరాటానికి సంఘీభావం ప్రకటించడానికి ఇష్టపడలేదు. ఆయన సంఘీభావం ప్రకటించి ఉండి ఉంటే ఈనాడు ఆ ఉద్యమం ఫలితం కళ్ళకి కనబడి ఉండేది.
శివాజీ ప్రారంభించిన ఆ పోరాటానికి జగన్ కూడా మద్దతు ఇవ్వలేదు. తను ఏదయినా ఒక సమస్య మీద ఉద్యమించగానే ప్రజలు, రాష్ట్రంలో అన్ని పార్టీలు తనతో కలిసి రావాలని కోరే జగన్, శివాజీ కూడా ప్రత్యేక హోదా కోసమే దీక్ష చేస్తున్నప్పుడు ఆయనకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? అంటే కారణం ఆ క్రెడిట్ ఆయనకి దక్కకూడదనే! అందుకే జగన్ వేరేగా దీక్ష చేసుకొన్నారు. అప్పుడూ మిగిలిన వారు కూడా అలాగే ప్రవర్తించారు. ఇటీవల రైల్వే జోన్ కోసం విశాఖలో వైకాపా గుడివాడ అమర్నాథ్ నిరాహార దీక్ష చేశారు. అప్పుడూ అంతే. దానికి వామపక్షాలు తప్ప ఇతర పార్టీలు ఏవీ మద్దతు ఈయకపోవడం గమనిస్తే మన రాజకీయపార్టీల సంకుచిత స్వభావం అర్ధం చేసుకోవచ్చు.
ప్రత్యేక హోదా కోసం ఈ నెల 10వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేద్దాము మాతో కలిసిరండి అని వైకాపా నేతలు తెదేపాని పిలుస్తున్నారు. దానికి వారి నుంచి ప్రతివిమర్శలే సమాధానంగా వచ్చేయి. మరొకరు చేసే పోరాటానికి జగన్ మద్దతు ఇవ్వనప్పుడు, తనకి వేరే వారు ఎందుకు మద్దతు ఇవ్వాలి? ఇస్తారు? అని ఆలోచించక పోవడం చిత్రమే.
అందరి లక్ష్యం ఒక్కటే కానీ వాటి వెనుక ఎవరి రాజకీయ ప్రయోజనాలు, అవసరాలు, లెక్కలు వారికుంటాయి. రాష్ట్ర ప్రయోజనాల కంటే తమ పార్టీ ప్రయోజనాలు, అవసరాలు, లెక్కలే వారికి ముఖ్యం అందుకే ఎవరి ఉద్యమాలు వారివే. ఒకరితో మరొకరు కలవరు. ఆంధ్రాకి చెందిన రాజకీయ పార్టీలు, ఎంపి, ఎమ్మెల్యేల మధ్య ఈ అనైక్యత కారణంగానే కేంద్రానికి కూడా ఆంధ్రా అంటే చాలా అలుసైపోయింది. అందుకే “ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజీ ఇవ్వబోము” అని తెగేసి చాలా ధైర్యంగా చెప్పగలుగుతోంది. రాజధాని నిర్మాణం, రైల్వే జోన్, పోలవరం, మెట్రో ప్రాజెక్టులు, విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు వంటి హామీలన్నిటినీ అటక మీద పడేసి చేతులు దులుపుకొంది. కనుక అందుకు కేంద్రాన్ని నిందించడం కంటే మన రాజకీయ పార్టీల వాటిని అవే నిందించుకొంటే మంచింది.