బీజేపీకి మద్దతిస్తామని తమ జోలికి రావొద్దని కోరుతున్న సంకేతాలను వైసీపీకి బీజేపీకి పంపింది. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలోనే ఢిల్లీలో వైసీపీ రాజ్యసభ ఎంపీలు మీడియా సమావేశం పెట్టారు. ఆ సమావేశం ఎజెండా.. టీడీపీ నేతలు తమపై దాడులు చేస్తున్నారని చెప్పడం కానీ.. అసలు విషయాన్ని పైపైన చెప్పి జాతీయ మీడియాకు మాత్రం… బీజేపీకి మద్దతుగా ఉంటామని కాస్త నేరుగానే చెప్పారు.
తమకు రాజ్యసభలో పదకొండు మంది సభ్యుల బలం ఉందన్నారు. బీజేపీ ఇప్పటికైనా తమపైనే ఆధారపడాల్సి ఉందని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. టీడీపీకి ఒక్క రాజ్యసభ సభ్యుడు కూడా లేరని.. మొత్తం ఎంపీలతో పోలిస్తే.. టీడీపీకి ఒక్క ఎంపీ మాత్రమే ఎక్కువగా ఉన్నారన్న సంగతిని మీడియాకు ప్రత్యేకంగా గుర్తు చేశారు. తాము రాష్ర ప్రయోజనాల కోసమే ఎవరికైనా మద్దతిస్తామని చెప్పుకొచ్చారు. అధికారంలో ఉన్పన్పుడు కూడా ఇదే చెప్పారు. ఎన్ని రాష్ట్ర ప్రయోజనాలు సాధించారో మాత్రం ఎవరికీ తెలియదు.
2014-19 సమయంలో టీడీపీ కూటమి ఎన్డీఏలో ఉన్నప్పటికీ బీజేపీతో జగన్ సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. దీని కోసం విజయసాయిరెడ్డి కీలకపాత్ర పోషించారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకు రావాలని…హోదా కోసం ఉద్యమం పేరుతో ఒత్తిడి చేశారు. అయితే అప్పటి కన్నా ఇప్పుడు వైసీపీ బలం మరింతగా దిగజారిపోయింది. వైసీపీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభసభ్యులు బీజేపీలోకి ఫిరాయించినా ఆశ్చర్యం లేదన్న వాదన వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో తమ మద్దదు బీజేపీకి ఉంటుందన్న సంకేతాలు పంపడం.. జాతీయ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.