ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ, ఈడీ దూకుడు చూపిస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను ఢిల్లీ తరలించి అక్కడి కోర్టులో హాజరు పర్చనున్నారు. సౌత్ గ్రూప్ నుంచి ఇప్పటికే ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు చంద్రారెడ్డిని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు. తర్వాత అభిషేక్ బోయినపల్లి, ఆడిటర్ బుచ్చిబాబును అరెస్ట్ చేశారు. ఇప్పుడు మాగుంట రాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు.
మాగుంట కుటుంబం దశాబ్దాలుగా డిస్టిలరీల వ్యాపారంలో ఉన్నారు. అయితే వారిపై ఎప్పుడూ తీవ్రమైన ఆరోపణలు రాలేదు. కానీ ఈ సారి మాత్రం మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్ కావాల్సి వచ్చింది. సౌత్ గ్రూపులో కేసీఆర్ కుమార్తె, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ్ మాగుంట, అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్‌చంద్రారెడ్డి లంచాలిచ్చి లిక్కర్ బిజినెస్ సొంతం చేసుకున్నారని ఈడీ చెబుతోంది.
సమీర్ మహేంద్రు: అరుణ్పిళ్లైకి, శరత్‌చంద్రారెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడైన రాఘవ్ మాగుంటకు చెందిన జైనాబ్ ట్రైడింగ్, ఖావో గలీకి ఈఎండీ కింద రూ.15 కోట్లు చెల్లించారు. మాగుంట ఆగ్రోఫామ్స్ ప్రైవేటు లిమిటెడ్ పేరిట రాఘవ్‌కు కూడా రెండు రిటైల్ జోన్లు ఉన్నాయిని ఈడీ చార్జిషీట్లో ప్రకటించింది.
మాగుంట రాఘవరెడ్డిని వచ్చే ఎన్నికల్లో పోటీ చేయించి ఎంపీగా చూడాలనుకున్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. ఆయన మాత్రం…. రాజకీయ జీవితం ఆరంభం కాకుండానే ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇరుక్కుని అరెస్టయ్యారు. ఈ కేసులో వరుసగా అరెస్టులు చేస్తూండటంతో.. తదుపరి ఎవరిని అరెస్ట్ చేస్తారోనన్న టెన్షన్ … ఇతర నిందితుల్లో ఏర్పడింది.