ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని అది ముగిసిన అధ్యాయమని ఎన్ని సార్లు కేంద్రం చెప్పినా తాము .. అన్ని సార్లు అడుగుతూనే ఉంటామని ఘనత వహించిన వైసీపీ ఎంపీలు ప్రకటించారు . అంతే కాదు ఈ సారి ప్రైవేటు బిల్లు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారట. ప్రైవేటు బిల్లు ఎలా పెడతారో… ఎంత మంది ఎంపీల మద్దతు కావాలో స్టడీ చేశారో లేదో కానీ.. ప్రకటన మాత్రం చేసేశారు. బడ్జెట్లో కనీస కేటాయింపులు లేవు.. సీమను ఎడారి చేసే అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చినా పట్టించుకోవడం లేదని తీవ్ర విమర్సలు వస్తూండటంతో మెల్లగా ముగ్గురు ఎంపీల్ని మీడియా ముందుకు పంపారు.
పార్లమెంట్లో సైలెంట్ గా ఉండి.. కనీసం బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నా మద్దతు ఇవ్వకుండా.. మీడియా ముందుకు వచ్చి మాత్రం భారీ ప్రకటనలు చేస్తున్నారు. విభజన చట్టంలో ప్రతిపాదించి ఇప్పటి వరకూ అమలు కాని అన్ని అంశాలపై ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెడతామని ఎవరు మాట్లాడితో పట్టించుకోరో ఆ ఎంపీలను తెర ముందుకు తెచ్చి చెప్పించారు. మెడికల్ కాలేజీలకు అనుమతులు ఇవ్వడం లేదని.. ఏం అడిగినా పట్టించుకోవడం లేదని ఎంపీలు చెప్పుకొస్తున్నారు. ఈ భీకర ప్రకటనలు చేసిన ఎంపీలు ఎవరంటే రంగయ్య, రెడ్డప్ప, పిల్లి సుభాష్. వీరు ఎంపీలనే విషయం చాలా మంది ఎప్పుడో మర్చిపోయారు కూడా.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన అధికారాన్ని ఏ మాత్రం ప్రజల కోసం వినియోగించని ఎంపీలుగా విమర్శలు ఎదుర్కొంటున్నారు వైసీపీ నేతలు. ఢిల్లీలో వారు చేసే లాబీయింగ్ పూర్తిగా వ్యక్తిగత అవసరాల కోసమే.. అదీ కూడా ప్రభుత్వ అవసరాల కోసమే . రాష్ట్రం కోసం సాధించింది.. చేసింది ఏమీ లేదు. చివరికి నష్టం చేస్తున్నా వ్యతిరేకించలేని దుస్థితికి చేరిపోయారు. కానీ ప్రకటనలు మాత్రం ఇలా భీకరంగా చేస్తూ ఉంటారు.