ఎన్నార్సీపై కేంద్రం ముందుకెళ్తే రాజీనామా చేస్తానని తనకు పదవులు ముఖ్యం కాదని.. ఉపముఖ్యమంత్రి అంజాద్ భాషా ప్రకటించారు. తనకు కూడా అంతేనని.. అసెంబ్లీలో ఎన్నార్సీకి వ్యతిరేకంగా తీర్మానం చేయకపోతే.. రాజీనామా చేస్తానని.. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా ప్రకటించారు. మజ్లిస్ అధినేత అసదుద్దీన్.. వారాంతాల్లో ఏపీలో.. సీఏఏ, ఎన్నార్సీ వ్యతిరేక సభలు నిర్వహిస్తున్నారు. అందులో అధికార పార్టీ .. తన మిత్రుడు అయిన జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు. గుంటూరులో ఏర్పాటు చేసిన..ఎన్నార్సీ వ్యతిరేక సభలో.. మోడీ అంటే.. జగన్‌కు భయమని తేల్చారు. అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ముస్తఫా తీర్మానం చేయకపోతే రాజీనామా చేస్తానని ప్రకటించారు.
వైసీపీ ముస్లిం ప్రజాప్రతినిధులు…ఓ రకంగా ముస్లింలను మభ్యపెట్టే ప్రయత్నమే చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. వైసీపీ.. ఎన్నార్సీ చట్టానికి అనుకూలంగా పార్లమెంట్లో ఓటు వేసింది. అది రికార్డెడ్. చట్ట పరంగా వైసీపీ ఇక వెనక్కి తగ్గే అవకాశం లేదు. పార్లమెంట్లో మద్దతిచ్చి.. బయట ముస్లింల ముందు వ్యతిరేకత వ్యక్తం చేయడం అంటే.. పార్లమెంట్‌ను అవమాన పరిచినట్లే అవుతుంది. అయినప్పటికీ.. ప్రజాగ్రహాన్ని తప్పించుకోవడానికి.. తాము ముస్లింలకు అండగా ఉంటామని చెప్పుకునేందుకు .. ఇప్పుడు వైసీపీ ప్రజాప్రతినిధులు.. ఎన్నార్సీకి వ్యతిరేకమని.. వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయిస్తామని చెబుతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా… ఎన్నార్సీ విషయంలో ఏం చేయాలన్నదానిపై తర్జనభర్జన పడుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీలో ఎన్నార్సీని అమలు చేయబోమంటూ.. కొన్నాళ్ల క్రితం.. కడప పర్యటనలో బహిరంగంగా ప్రకటించారు. ఆ తర్వాత ఇటీవల కర్నూలు పర్యటనకు వెళ్లినప్పుడు.. ముస్లిం పెద్దలతో.. కేంద్ర చట్టాన్ని .. అమలు చేయకుండా ఆపే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి లేదని.. చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. దీంతో.. వైసీపీ విధానంపై స్పష్టత లేక.. ముస్లింలు కూడా.. ఆందోళన చెందుతున్నారు. అయితే.. వారు మాత్రం పోరు బాట ఆపడం లేదు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. తమపై వస్తున్న ఒత్తిడికి తగ్గట్లుగానే రాజీనామాల ప్రకటనలను..వైసీపీ ముస్లిం నేతలు చేస్తున్నారు. దీనికి వైసీపీ అధినేత ఎలాంటి పరిష్కారం కనుగొంటారో మరి..!