వైసీపీ జాతీయ అధికార ప్రతినిధిగా మీడియా చానళ్లలో కనిపించే కె.రవిచంద్రారెడ్డి అనే వైసీపీ నేత హఠాత్తుగా బీజేపీలో చేరిపోయారు. జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఓ నామినేటెడ్ పోస్టు కూడా పొంది పదవి అనుభవించేసిన ఆయన వైసీపీ ఓడిపోగానే నాలుక మడతేసి విమర్శలు చేయడం ప్రారంభించారు. సజ్జల రామకృష్ణారెడ్డి వల్లనే పార్టీ ఓడిపోయిందని ఓ సారి సాక్షి చానల్ డిబేట్ లోనే చెప్పడంతో ఆయనను బ్యాన్ చేశారు. పార్టీ తరపున మాట్లాడేందుకు అప్పటి నుంచి అవకాశం ఇవ్వలేదు.
టీవీ చానళ్లలో డిబేట్లలో పాల్గొనే వారి జాబితా నుంచి ఆయన పేరు తొలగించారు. అప్పట్నుచి వైసీకి దూర దూరంగా ఉన్న ఆయన తాజాగా బీజేపీలో చేరిపోయారు. పురందేశ్వరి, సత్యకుమార్ సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన వెళ్లిపోతే వైసీపీ నేతలు పెద్దగా పట్టించుకునే అవకాశాలు లేవు కానీ.. పార్టీలో అసలు మాట్లాడే అవకాశం లేకుండా చేసి వెళ్లిపోయేలా చేయడంపై మాత్రం చర్చలకు కారణం అవుతోంది.
వైసీపీలో సజ్జల రామకృష్ణారెడ్డిని కాదని ఎవరూ రాజకీయాలు చేయలేరు. ఆయనను పొగుడుతూ ఉండాలి. తప్పు ఆయన వైపు ఉన్నప్పటికీ తప్పు అని చెప్పకూడదు. అలాంటి వారికే అవకాశం ఉంటుంది. రవిచంద్రారెడ్డిని అలాగే కట్టడి చేయడంతో పార్టీ మారిపోయారు. అవకాసాలు లేక చాలా మంది సైలెంట్ గా ఉన్నారు కానీ.. సజ్జల దెబ్బకు సగం పార్టీ ఖాళీ అవుతుందన్న సెటైర్లు వినిపిస్తున్నాయి.