ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ డా. కోడెల శివప్రసాదరావుపై అవిశ్వాసం ప్రకటిస్తూ వైకాపా ఈరోజు అసెంబ్లీ కార్యదర్శికి నోటీసు అందజేయబోతోంది. కానీ ఆ ఇచ్చే నోటీసు ఏదో నిన్న సభ జరుగుతున్నప్పుడే ఇచ్చి ఉండి ఉంటే వేరేలా ఉండేది. శాసనసభ నిరవధికంగా వాయిదాపడే వరకు ఆగి ఇవ్వాళ్ళ నోటీస్ ఇవ్వడంతో అది కేవలం రాజకీయ ఎత్తుగడ అని స్పష్టం అవుతోంది. మళ్ళీ శాసనసభ సమావేశాలు మొదలయ్యే వరకు దానిపై సభలో చర్చించడం సాధ్యం కాదు కానీ మీడియాలో చర్చించవచ్చును. వైకాపా చేతిలో ఎలాగూ స్వంత మీడియా ఉంది కనుక దానిలో ఈ అంశంపై తమకు అనుకూలంగా ఎంతయినా చర్చించవచ్చును. ఆ చర్చలతో ప్రభుత్వాన్ని నిందించవచ్చును.
కానీ వచ్చే బడ్జెట్ సమావేశాలలో ఈ అవిశ్వస తీర్మానాన్ని ప్రవేశపెట్టినా వైకాపా దానిని నెగ్గించుకోగలదా? అంటే లేదనే ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే ఆ పార్టీకి సభలో కేవలం 57 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. ఈ సంగతి వైకాపాకు తెలియకనే అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చిందని అనుకోలేము. కానీ ఎందుకు ఇచ్చిందంటే అందుకు బలమయిన కారణమే కనబడుతోంది.
శాసనసభలో అధికార పార్టీని నిలదీయడానికి వైకాపాకి చాలా మంచి అవకాశాలు ఉన్నప్పటికీ, రోజా కారణంగా సభలో ఎదురుదెబ్బ తగిలింది. జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీని చాలా గట్టిగానే నిలదీశారు. కానీ రోజా విషయంలో ఆయన కూడా వరుసగా తప్పటడుగులు వేశారు. శాసనసభను రెండు రోజుల ముందుగానే బహిష్కరించి బయటకి వచ్చేయడంతో తెదేపా వ్యూహం ముందు జగన్ చిత్తయిపోయినట్లు అంగీకరించినట్లయింది. బహుశః ఆ చర్చపై నుండి ప్రజల దృష్టి మళ్ళించేందుకు ఈ అవిశ్వాస ఐడియాని మళ్ళీ తెరపైకి తీసుకువచ్చేరేమో? కానీ అది కూడా మరో పొరపాటే అని చెప్పవచ్చును. పదేపదే స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ, దానిని మళ్ళీ ఉపసంహరించుకొంటుండటం వలన ప్రజలకు అదొక పిల్లచేష్టగా కనబడుతుంది. దాని వలన వైకాపాయే ప్రజలలో చులకన అవుతుంది. దానికే చెడ్డపేరు వస్తుంది.