రాజకీయ పార్టీలకి శాసనసభలో వాటి సభ్యుల సంఖ్య ఆధారంగా అమరావతిలో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి భూమి కేటాయించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వైకాపా తప్పు పట్టింది.
“తెదేపా ప్రభుత్వానికి భూదాహం ఎక్కువైపోయిందనడానికి ఇది మరొక చక్కటి ఉదాహరణ. ఎన్నికల సమయంలో పేదలకి ఇళ్ళు కట్టిస్తానని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని ఇంతవరకు అమలుచేయలేదు కానీ వారి భూములని కూడా ఏదో విధంగా గుంజుకొంటూ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి ప్రభుత్వం వేల ఎకరాలు సేకరించింది. పరిశ్రమలు, విమానాశ్రయాలు, నౌకాశ్రయల పేరిట ఇంకా అనేక వేల ఎకరాలని రైతుల నుంచి గుంజుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పడు రాజకీయ పార్టీల పేరు చెప్పి భూములు గుంజుకోవాలనుకొంటోంది. రైతుల దగ్గర నుంచి భూములు గుంజుకొని రాజకీయ పార్టీలకి భూములు కేటాయించడం అవసరమా? ఈ ఆలోచనలో కూడా తెదేపా తన కపటత్వం ప్రదర్శించుకొంది. శాసనసభలో సభ్యుల సంఖ్య ఆధారంగా భూకేటాయింపుల నిబందనతో మిగిలిన అన్ని పార్టీలని తప్పించేసి, తెదేపాకి మాత్రం నాలుగు ఎకరాలు కేటాయించేసుకొంది. దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇటువంటి ఆలోచన రాలేదు. చేయలేదు కూడా. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ని బలవంతంగా స్వాధీనం చేసుకొన్నప్పుడే చంద్రబాబు నాయుడుకి ఎంత భూదాహం ఉందో అర్ధమైంది,” అని బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు.
పరిశ్రమలు, సాగునీటి ప్రాజెక్టుల కోసం ప్రభుత్వాలు భూసేకరణ చేయడం సర్వసాధారణమైన విషయమే. కానీ రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకేసారి అనేక అభివృద్ధి పనులని చేప్పట్టవలసిరావడంతో తెదేపా ప్రభుత్వం చాలా బారీగా భూసేకరణ కార్యక్రమం చేపట్టవలసి వస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి వేల ఎకరాలు భూసేకరణకి ప్రభుత్వం సిద్దమవడంతో సహజంగానే ప్రజలు, ప్రతిపక్షాల నుంచి దానికి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.
అభివృద్ధి పేరిట అవసరమైన దానికంటే పదింతలు ఎక్కువ భూసేకరణకి పూనుకోవడం, సేకరించిన భూమిని ఈవిధంగా రాజకీయ పార్టీలకి, కార్పోరేట్ కంపెనీలకి పంచిపెట్టాలనుకోవడం వలన ఆ వ్యతిరేకత ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గదు. గతంలో ప్రభుత్వోద్యోగులలో, రైతులలో వ్యతిరేకత ఏర్పడినందునే తెదేపా పదేళ్ళు ప్రతిపక్షంలో కూర్చోవలసి వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు తన మైండ్ సెట్ మార్చుకొన్నానని స్వయంగా చెప్పుకొన్నారు కూడా. కానీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం తీసుకొంటున్న ఈ బారీ భూసేకరణ నిర్ణయాల వలన ఆందోళన చెందుతున్న లేదా నష్టపోతున్న ప్రజలు, రైతులలో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత పెరగకమానదు. అది ప్రభుత్వానికి, తెదేపాకి కూడా మంచిది కాదని గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.