చింత చచ్చినా పులుపు చాదన్నట్లు, తెలంగాణాలో వైకాపా దాదాపు తుడిచిపెట్టుకుపోయినప్పటికీ దాని హడావుడికి ఏమీ తక్కువలేదు. పార్టీలో మిగిలిన ఏకైక ఎంపి మరియు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఏకైక ఎమ్మెల్యే వెంకటేశ్వరులు పార్టీని వీడి తెరాసలో చేరిపోవడంతో, పార్టీ జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కొత్త అధ్యక్షుడు, కార్యవర్గాన్ని నియమించారు. గట్టు శ్రీకాంత్ రెడ్డి ఈరోజు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఖమ్మం జిల్లాలో పాలేరు ఉపఎన్నికల కోసం పార్టీ తరపున ఐదుగురు ఎన్నికల పరిశీలకులను నియమించారు. వారిలో ఆయన కూడా ఒకరు. ఈ ఉపఎన్నికలలో వైకాపా పోటీ చేస్తున్నట్లయితే అది చాలా సహజంగానే ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి సుచరితా రెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించి వైకాపా ఎన్నికల బరిలో నుంచి తప్పుకొంది. కనుక ఈ ఉపఎన్నికలతో దానికి సంబంధమే లేదు. అయినా ఎన్నికల పరిశీలకులని నియమించుకోవడం చాలా హాస్యాస్పదంగా ఉంది.