కోనసీమలో జిల్లా పేరు మార్పు అంశంపై రేగిన వివాదం కారణంగా చెలరేగిన విధ్వంసం తర్వాత వందల మంది యువతపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతూండటంతో.. వైసీపీ నేతలకు ఓట్లు గుర్తుకు వస్తున్నాయి. తాము కేసులు ఉపసంహరించుకుంటామని చెబుతున్నారు. కోనసీమ అల్లర్ల కేసులు తొలగింపుపై చర్చలు కొనసాగుతున్నాయని మంత్రి దాడిశెట్టి రాజాతో పాటు … ఎంపీ మిధున్ రెడ్డి చెబుతున్నారు.
మంత్రి, ఎమ్మెల్యే ఇళ్ళ పై జరిగిన దాడి కేసులు మినహాయిస్తే మిగిలిన కేసులు తొలగింపునకు ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నామని .. త్వరలో ఎత్తి వేస్తామని చెబుతున్నారు. అసలు ఎమ్మెల్యే, మంత్రి ఇళ్లపై దాడులు కాకండా.. ఇతర కేసులు ఎందుకు పెట్టారనేది సస్పెన్స్. అసలు సంఘటనా స్థలంలో లేని వారిపైనా కేసులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వందల మందిని అరెస్టు చేశారు. వీరందరూ యువతే.
ఈ కేసుల్లో ప్రధానంగా రెండు సామాజిక వర్గాలకు చెందిన వారే ఎక్కువగా అరెస్ట్ అయ్యారు. అయితే అందులో ఓ సామాజిక వర్గం వైసీపీకు అనుకూలమైన వర్గంగా ముద్ర ఉండగా.. వారు పార్టీకి దూరమయ్యారని, ఆ లోటును పూడ్చుకుని దూరమైన వారిని దగ్గర చేసుకునేందుకు కేసుల ఎత్తివేత వ్యూహమని భావిస్తున్నారు. ఈ అల్లర్లలో సంబందమున్న 250 మందిని అరెస్ట్ చేశారు. నేటికీ ఈ కేసు దర్యప్తు జరుగుతుండగా 50 మంది వరకు పరారీలో ఉన్నారు.
కేసులు పెట్టడం.. వాటి నుంచి విముక్తి కల్పిస్తున్నట్లుగా చెప్పుకుని ఓట్లు దండుకోవడం అనే వ్యూహాలను వైసీపీ పాటిస్తున్నట్లుగా బాధితులు ఆరోపిస్తున్నారు.