వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఈనెల 26నుండి గుంటూరులో చేయతలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో వైకాపా నేతలు తదుపరి కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నారు. మంత్రి ప్రతిపాటి పుల్లారావు వారికి ఒక ఉచిత సలహా ఇచ్చారు. రద్దీగా ఉండే ప్రాంతాలలో కాకుండా ఎక్కడయినా నిర్జన ప్రదేశంలో జగన్ ఎన్ని రోజులు దీక్షలు చేసుకొన్నా తమకు ఎటువంటి అభ్యంతరమూ లేదని అన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పోలీసులు జగన్ దీక్షకు అనుమతి నిరాకరిస్తే, వైకాపా నేతలు ప్రభుత్వాన్ని నిందించడం భావ్యం కాదని ఆయన అన్నారు. ఆయన వాదనతో వారు అంగీకరించకపోయినా అయన చెప్పిన సలహాను మాత్రం స్వీకరించే ఆలోచనలో ఉన్నట్లు తాజా సమాచారం. ఆయన సూచన మేరకు జగన్ దీక్షను గుంటూరులోనే వేరే చోట అదే రోజు నుండి నిర్వహించేందుకు వైకాపా నేతలు ఆలోచిస్తున్నట్లు తాజా సమాచారం.