ఈరోజు నుండి గుంటూరులో మొదలుకావలసిన జగన్మోహన్ రెడ్డి ఆమరణ నిరాహార దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో దానిని వాయిదా వేసుకొంటున్నట్లు వైకాపా నిన్ననే ప్రకటించింది. న్యాయవ్యవస్థపై తమ పార్టీకి అపారమయిన నమ్మకం ఉందని హైకోర్టు తమ దీక్షకు తప్పకుండా అనుమతిస్తుందని నమ్ముతున్నట్లు తెలిపారు. సోమవారం హైకోర్టులో మరో పిటిషన్ వేసి కోర్టు అనుమతించిన తరువాత దీక్షకి తేదీ ప్రకటిస్తామని వైకాపా నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి నిన్ననే ప్రకటించారు. కానీ 12గంటలయినా గడవక ముందే జగన్ దీక్షకు వైకాపా మరో కొత్త ముహూర్తం ప్రకటించింది. నిన్న రాత్రి సమావేశమయిన పార్టీ సీనియర్లు తదుపరి కార్యాచరణపై చర్చించి అక్టోబర్ 6 లేదా 7వ తేదీ నుండి జగన్ దీక్ష ప్రారంభించాలని నిర్ణయించినట్లు సాక్షి మీడియాలో వార్త వచ్చింది.
ఇప్పటికే రెండు సార్లు జగన్ దీక్షని వాయిదా వేసుకోవలసి వచ్చింది. అటువంటప్పుడు హైకోర్టు అనుమతించిన తరువాతనే తేదీలు ప్రకటిస్తామని చెప్పిన వైకాపా హైకోర్టు అనుమతిస్తుందో లేదో తెలుసుకాకుండానే మళ్ళీ ఇంత హడావుడిగా తేదీలు ప్రకటించవలసిన అవసరం ఏమిటో తెలియదు కానీ ఒకవేళ హైకోర్టు అనుమతి నిరాకరిస్తే మళ్ళీ నవ్వులపాలు కాక తప్పదు. వైకాపా చేస్తున్న ఈ హడావుడితో ప్రత్యేక హోదా అంశం పక్కకుపోయి ఇంకా ఎప్పుడు మొదలవుతుందో తెలియని ఈ దీక్ష చాలా బాగా హైలైట్ అయ్యింది. దానికి ఉచితంగా మంచి ప్రచారం కూడా లభిస్తోంది. బహుశః అందుకే వైకాపా నేతలు మళ్ళీ మరో కొత్త ముహూర్తం ప్రకటించారేమో?