వైఎస్సార్ హయాంలో చేపట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులను జగన్ అధికారంలోకి వచ్చాక జల సమాధి చేశారని పీసీసీ చీఫ్ షర్మిల విమర్శలు చేస్తుంటే..వాటిని డిఫెండ్ చేసుకోవాల్సిన వైసీపీ ఆ పని చేయకపోగా కాంగ్రెస్ కు గాలికొడుతుండటం చర్చనీయాంశం అవుతోంది. పోలవరం ప్రాజెక్టుకు పునాది వేసింది వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని, ఆయన హయంలోనే అన్ని అనుమతులు తీసుకొచ్చి పనులు చేపట్టారని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశంసించడం హాట్ టాపిక్ అవుతోంది.
రాష్ట్ర విభజన సమయంలో పోలవరంకు జాతీయ హోదా ఇచ్చింది కాంగ్రెస్ అని, 2014లో కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉన్నప్పటికీ పోలవరాన్ని పూర్తి చేయలేకపోయిందంటూ కాంగ్రెస్ ను పొగుడుతూ టీడీపీని విమర్శించారు. వైఎస్ కలల ప్రాజెక్టు అని చెప్తున్నా పోలవరంను 2019లో అధికారం చేపట్టిన వైసీపీ ఎందుకు పూర్తి చేయలేకపోయింది అన్నది ఇప్పుడు బుగ్గన వ్యాఖ్యలతో మరోసారి చర్చ ప్రారంభమైంది.
అయినా.. పోలవరం ప్రాజెక్టు విషయంలో టీడీపీ, కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలకు ధీటుగా బదులు ఇవ్వకుండా.. పోలవరం వైఎస్ కలల సౌధం అని బుగ్గన పేర్కొనడం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే వైసీపీ అడుగులు కాంగ్రెస్ సారధ్యంలోని ఇండియా కూటమి వైపు పడుతున్నాయని…జగన్ వరుస బెంగళూరు పర్యటనల సారాంశం ఇదేనని ఓ వైపు ప్రచారం జరుగుతోండగా.. బుగ్గన కాంగ్రెస్ కు ఎలివేషన్స్ ఇవ్వడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.