ఏపిలో ప్రతిపక్షాలని ఎదుర్కొని దెబ్బతీసేందుకు తెదేపా ఒక పద్ధతి అనుసరిస్తుంటే, తెదేపాని దెబ్బ తీసేందుకు ప్రతిపక్షాలు మరో పద్దతి అనుసరిస్తున్నాయి. వైకాపా ఎమ్మెల్యేలని తెదేపాలోకి ఫిరాయింపజేయడం ద్వారా ఆ పార్టీని దెబ్బ తీసేందుకు తెదేపా ప్రయత్నిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. వైకాపా కూడా తనకి బాగా అలవాటైన ‘మిత్రభేదం’ వ్యూహంతో తెదేపాని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఇదివరకు ఫ్లెక్సీ బ్యానర్స్ పై జూ.ఎన్టీఆర్, స్వర్గీయ ఎన్టీఆర్ ల ఫోటోలు ముద్రించి తెదేపాకి,నందమూరి కుటుంబానికి మధ్య చిచ్చుపెట్టింది. ఆ దెబ్బకి జూ.ఎన్టీఆర్, హరికృష్ణ పార్టీ నుంచి దూరంకాక తప్పలేదు. హరికృష్ణ మళ్ళీ తెదేపా కార్యక్రమాలలో పాల్గొంటునప్పటికీ ఆయన పార్టీలో మునుపటి ప్రాధాన్యత కోల్పోయారు. ఇక జూ.ఎన్టీఆర్ అయితే శాస్వితంగా తెదేపాకి దూరం అయ్యారు.
మళ్ళీ ఇటీవల తెలంగాణా ప్రాజెక్టులని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి కర్నూలులో చేసిన దీక్ష కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాల మధ్య, ముఖ్యమంత్రులు, మంత్రుల మధ్య చిచ్చు రగిల్చారు. తాజాగా తెదేపా, భాజపాల మధ్య ఇప్పటికే ఏర్పడిన దూరాన్ని మరింత పెంచే ప్రయత్నాలు చేస్తున్నట్లు ‘తెగనున్న మూడో ముడి’ అనే శీర్షికన సాక్షి పత్రిక బుదవారం సంచికలో ప్రచురించిన ఆర్టికల్ చదివితే అర్ధం అవుతుంది.
కృష్ణా పుష్కరాల కోసం రోడ్లు వెడల్పు కోసం ఆలయాలని కూల్చి వేయడం, అలాగే కేంద్రం విడుదల చేస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తూ మళ్ళీ కేంద్రాన్ని విమర్శిస్తున్నందుకు తెదేపాపై భాజపా చాలా ఆగ్రహంగా ఉందని సాక్షి పేర్కొంది. వాటిపై భాజపా చాలా తీవ్రంగా స్పందించబోతోందని, రాష్ట్రంలో తెదేపాకి గట్టిగా బుద్ధి చెప్పేందుకు అందుకు సరైన వ్యక్తినే రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు పేర్కొంది.
సాక్షి పేర్కొన్న ఆ రెండు సమస్యలు వాస్తవమే. వాటి కారణంగా తెదేపాపై భాజపా చాలా ఆగ్రహంగా ఉన్న మాట కూడా వాస్తవమే. అయితే భాజపా ఏమి చేయబోతోందో అని ఊహిస్తూ వ్రాస్తున్న ఇటువంటి కధనాలు భాజపా ఏమి చేయాలో మార్గదర్శనం చేస్తున్నట్లుంది.
అధికారులు విజయవాడలో కొన్ని ఆలయాలని కూలద్రోసిన తరువాత కూడా రాష్ట్ర భాజపా నేతలు స్పందించకపోవడం చూసి, వైకాపా ఎమ్మెల్యే రోజా మీడియాతో మాట్లాడుతూ, “దీనిపై భాజపా నేతలు స్పందించాలి. మీ వైఖరి ఏమిటో తెలియజేయాలి. తెదేపాని అడ్డుకోవాలి,” అంటూ దిశానిర్దేశం చేసారు. ఆ తరువాతే రాష్ట్ర భాజపా నేతలు రంగంలో దిగారు. కనుక ఇప్పుడు కూడా సాక్షి ద్వారా భాజపాకి వైకాపా మార్గనిర్దేశనం చేస్తున్నట్లుగానే కనిపిస్తోంది. తద్వారా తెదేపా, భాజపాల మధ్య దూరం ఇంకా పెరిగేందుకు కృషి చేస్తున్నట్లుంది. ఆ రెండు పార్టీల మధ్య నెలకొన్న వాతావరణం కూడా అందుకు అనుకూలంగానే ఉంది కనుక వైకాపా ఆవిధంగా ప్రయత్నించడం సహజమే. దాని ఈ మిత్రభేదం వ్యూహానికి అవి చిత్తవుతాయో లేక త్రిప్పి కొడతాయో చూడాలి.