వైసీపీ హయాంలో చెలరేగిపోయిన ముగ్గురు ఐపీఎస్లకు మరో ఆరు నెలల సస్పెన్షన్ కాలం గిఫ్ట్ గా వచ్చింది. సినీ నటి జెత్వానీని తప్పుడు కేసు పెట్టి కిడ్నాప్ చేసి తీసుకు వచ్చి చిత్ర హింసలు పెట్టిన వ్యవహారంలో పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలను గతంలోనే సస్పెండ్ చేశారు. వీరి సస్పెన్షన్ కాలం ముగియడంతో మరోసారి సస్పెన్షన్ పొడిగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీరు ముగ్గురు చేసిన చట్టాల ఉల్లంఘన గురించి చెప్పుకుంటే పెద్ద పుస్తకం అవుతుంది. టీడీపీ నేతలపై చేసిన అరాచకాల గురించి ఇంకా కేసులు పెట్టడం ప్రారంభించలేదు.
వీరు చేసిన వ్యవహారాలపై పూర్తి స్థాయి సాక్ష్యాధారాలు ఉన్నాయి. జెత్వానీ కేసులో హైకోర్టు కూడా ఎందుకు సీతారామాంజనేయుల్ని అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. ఆయనను అరెస్టు చేయకపోవడం వల్ల ఇతర ఐపీఎస్లకూ ముందస్తు బెయిల్ లభించింది. వారు సీనియర్ పోలీసు ఆఫీసర్లని వారి కెరీర్ గురించి ఆలోచిస్తున్నారేమో తెలియదు కానీ.. వారు ఆ డ్రెస్ వేసుకుని నిర్వహించాల్సిన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో విస్మరించి ఓ మాఫియాగా మారారు.సర్వీసులో ఉండాల్సిన వారు కాదన్న విమర్శలు ఉన్నాయి.
వారిపై ఎప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేస్తారన్న ప్రశ్నలు సహజంగానే వస్తున్నాయి. ముఖ్యంగా పీఎస్ఆర్ ఆంజనేయలు అటు కోడెల ఆత్మహత్యకు ప్రధాన కారణం అన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే చంద్రబాబును అరెస్టు చేయడం, పలుమార్లు రాళ్ల దాడులు చేయడం వెనుక మాస్టర్ మైండ్ అని చెబుతారు. కాంతిరాణా టాటా వైపీఎస్ గా ఎంత విధేయత చూపించారో కళ్ల ముందే ఉంది. పోస్టింగ్ ల కోసం అడ్డదారులు తొక్కిన వీరంతా ఇప్పుడు సస్పెన్షన్ లో ఉన్నారు. ఇది సరిపోదని ఇంకా అసలు చర్యలు ప్రారంభించాలన్న డిమాండ్లు టీడీపీ క్యాడర్ నుంచి వస్తున్నాయి.