ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశం మొదలయిన వెంటనే అగ్రి గోల్డ్ వ్యవహారంపై సభలో గొడవ మొదలయింది. దానిపై తక్షణమే చర్చ మొదలుపెట్టాలని వైకాపా కోరినపుడు, ప్రశ్నోత్తరాల సమయం తరువాత దానిపై చర్చ చేపడదామని స్పీకర్ కోడెల శివప్రసాద రావు చెప్పగా అందుకు వైకాపా సభ్యులు అంగీకరించకుండా తక్షణమే దానిపై చర్చ చేపట్టాలని పట్టుబడుతో స్పీకర్ వద్దకు దూసుకు వచ్చి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. దానితో స్పీకర్ సభను ఐదు నిమిషాలు వాయిదా వేసారు కానీ, సభ మళ్ళీ మొదలవగానే వైకాపా సభ్యులు యధాప్రకారం తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దానితో మళ్ళీ మరో పది నిమిషాలు సభను వాయిదా వేయవలసి వచ్చింది.
ఇదేమీ ఆషామాషీ వ్యవహారం కాదని, రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 32 లక్షల మంది సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు అగ్రి గోల్డ్ సంస్థలో పెట్టుబడులు పెట్టి మోసపోయారని, ఇది సుమారు రూ. 7,000 కోట్ల భారీ కుంభకోణం అని వైకాపా వాదించింది. అసెంబ్లీ సమావేశాలు ముగియడానికి ఇంకా కేవలం మూడు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది కనుక దీనిపై తక్షణమే సభలో చర్చ చేపట్టాలని వైకాపా వాదించింది. ప్రస్తుతం దీనిపై శాసనసభలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది.
అనేక లక్షల మంది ప్రజలకు సంబంధించిన ఈ సమస్యపై శాసనసభలో చర్చ జరగాలని ప్రతిపక్షం కోరడం సమజసమే కానీ దాని కోసం అత్యుత్సాహం ప్రదర్శించడం వలన దీనిపై సభలో చర్చ జరపకుండా ప్రభుత్వం తప్పించుకొనేందుకు అవకాశం కల్పించినట్లవుతుందని, ఆ కారణంగా సమస్య అపరిష్కృతంగా మిగిలిపోయే అవకాశం ఉంటుందని గ్రహిస్తే బాగుంటుంది.