వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎదుర్కోవడం మిగతా వైసీపీ ఎంపీలకు కష్టమై పోతోంది. ఆయన ప్రెస్మీట్లు పెట్టకుండా చేయాల్సినదంతా చేసినా .. చివరికి దేశద్రోహం కేసు పెట్టినా ఆపలేకపోయారు. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ఆయన మాట్లాడుతూండటంతో అడ్డుకోలేకపోతున్నారు. సోమవారం లోక్‌సభ జీవో అవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. రైతుల పాదయాత్రపై పోలీసుల దాడుల అంశాన్నిప్రధానంగా ప్రస్తావించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని … రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని తీవ్రంగా హింసిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమైనా … క్షీణించాయి కాబట్టి లో్‌సభలో చెప్పక తప్పడం లేదన్నారు. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా పోలీసులు హరిస్తున్నారని రఘురామ సభ దృష్టికి తీసుకెళ్లారు. రఘురామను ఎలా ఆపాలో తెలియక వైసీపీ ఎంపీలు తంటాలు పడ్డారు. లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి.. సభలో రఘురామపై రాజకీయ విమర్శలు చేశారు. సీబీఐ కేసుల నుంచి బయటపడేందుకు బీజేపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
రఘురామపై ఉన్న సీబీఐ కేసులపై వేగంగా దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. వెంటనే రఘురామ కూడా కౌంటర్ ఇచ్చారు. తనపై రెండే సీబీఐ కేసులు ఉన్నాయని. .. మీ నాయకుడిపై వంద కేసులున్నాయని.. వాటి సంగతి ముందు తేల్చాలన్నారు. వైసీపీ ఎంపీలు పరస్పరం తమ కేసుల గురించి చెప్పుకోవడం.. ఇతర పార్టీలు.. రాష్ట్రాల సభ్యులను ఆశ్చర్య పరిచింది.