సీఎంగా చేసి ఫర్నీచర్‌ను కొట్టేశారని జగన్ పై వస్తున్న ఆరోపణలకు వైసీపీ స్పందించింది. ఓడిపోగానే.. ప్రజాధనంతో క్యాంప్ ఆఫీసు కోసం కొనుగోలు చేసిన వస్తువులన్నింటికీ డబ్బులిస్తామని ప్రభుత్వానికి సమాచారం ఇచ్చామని వైసీపీ చెప్పుకొచ్చింంది. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. అయితే నిజంగా డబ్బులిస్తామని లేఖ రాసి ఉంటే.. ఆ లేఖను ఖచ్చితంగా బహిర్గతం చేసే వారు. అలాంటి లేఖ ఏదీ రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మామూలుగా అయితే ఈ విషయంలో జగన్ రెడ్డి మాజీ సీఎం కాబట్టి.. కొంత గౌరవంగా అందరూ స్పందించేవారు. కానీ రెండు లక్షల రూపాయల ఫర్నీచర్ విషయంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదారవుపై దొంగ అనే ముద్ర వేసి ఇష్టం వచ్చినట్లుగా నీలి, కూలి మీడియాలతో ప్రసారం చేయించి ఆయనను ఆత్మహత్య చేసుకునేలా చేశారు. కోడెల చాలా మందుగానే తన వద్ద ఫర్నీచర్ ఉందని తీసుకుంటే ఓకే లేకపోతే విలువ కట్టినా ఇచ్చేస్తానని లేఖ రాశారు. ఆ లేఖ ద్వారానే ఫర్నీచర్ ఉందని ప్రభుత్వానికి తెలిసింది. అదే సందు అనుకుని ఆ లేఖను దాచి పెట్టి ఆయనపై ఫర్నీచర్ దొంగ అంటూ కేసులు పెట్టి వేధించారు.
ఇదంతా ఇప్పుడు అందరికీ గుర్తుకు వచ్చింది కాబట్టే.. జగన్ రెడ్డికి కూడా అదే తరహా శిక్ష.. ఫర్నీచర్ దొంగతనం కేసులు పెట్టాలన్న డిమాండ్లు వస్తున్నాయి. అసలు క్యాంప్ ఆఫీస్‌కు చేసిన ఖర్చు..రోడ్లు, హెలిప్యాడ్ సహా… కనీసం యాభై కోట్లకుపైగా ఉంటుందని అంచనా. వాటన్నింటికీ లెక్క కట్టి ఇస్తామని చెబుతారో లేకపోతే.. జీవోలు ఇచ్చిన వాటికి మాత్రమే ఇస్తామంటారో చూడాల్సి ఉంది.