శాసనమండలిని రద్దు చేస్తామనే దగ్గర నుంచి అదే శాసనమండలిలో ఎప్పుడో ఆరేడు నెలల తర్వాత జరిగే ఎన్నికలకు ఇప్పుడే అభ్యర్థుల్ని ప్రకటించి విప్లవం తెచ్చేశామనేలా ప్రచారం చేసుకునేలా “మడమ తిప్పుడు” వైసీపీ పెద్దల్లో కనిపిస్తోంది. శాసనమండలి రద్దు తీర్మానం సమయంలో శాసన వ్యవస్థలో భాగమైన అ వ్యవస్థ గురించి ముఖ్యమంత్రి జగన్ మాట్లాడిన మాటలు అందరికీ గుర్తున్నాయి. దానిపై ఒక్క రూపాయి ఖర్చు పెట్టడం కూడా దండగని.. అలాంటిది రూ. అరవై కోట్లకుపైగా ఖర్చు పెడుతున్నామని అన్నారు.
అంతా పనికి మాలిన వాళ్లే ఉన్నారని తేల్చారు. ఇప్పుడు అదే శాసనమండలికి తమ పార్టీ సభ్యులు ఎన్నికవుతున్నారు.. ఎంపిక చేస్తున్నారు.. వారందర్నీ గొప్పగా కీర్తిస్తున్నారు. శాసనమండలి లాంటి ఓ గొప్ప ప్రదేశానికి జగన్ వారిని పంపుతున్నట్లుగా కీర్తిస్తున్నారు. గతంలో అన్న మాటలను ఇప్పుడు గుర్తు చేసుకోవడం లేదు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మండలిలో పూర్తి మెజార్టీ వచ్చింది. కొంత కాలం పోతే మరో పార్టీకి కనీస ప్రాతినిధ్యం కూడా ఉండటం కష్టం. అప్పుడు మండలి ఏపీ ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైపోతుంది. అందులో ఉన్న వాళ్లు తమ పార్టీ వాళ్లే కాబట్టే అందరూ గొప్ప వాళ్లు అని అనుకున్నా.. ఆశ్చర్యపోనవసరం లేదు.
అప్పుడు రూ. అరవై కాకపోతే రూ. 160 కోట్లు వెచ్చిస్తారు. తమ పార్టీ వారైతేనే మంచి.. విపక్షాలు అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండాల్సిన వారు కాదన్న అభిప్రాయంతో ఉండే వైసీపీ నేతల అభిప్రాయం ఇప్పుడు మారిపోవడం ఖాయం. అయితే వైసీపీ నేతలకు ఎప్పుడూ ప్రజల నుంచి ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. మండలి గురించి జగన్ మాట్లాడిన మాటలు పబ్లిక్. అవి సోషల్ మీడియాలో ఎప్పుడూ సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి. మండలి సభ్యుల గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చినా వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. జగన్ అప్పుడు చెప్పిందేమిటి.. ఇప్పుడు చేస్తుందేమిటన్న ప్రశ్న అందరూ వేస్తారు. వైసీపీ నేతలకు ఇప్పుడు సంతోషంగానే ఉంటుంది.. అందుకే మడమ తిప్పుడో విప్లవం వచ్చిందని సెటైర్లు పడుతున్నాయి.