ఉచిత విద్యుత్‌కు బదులు నగదు బదిలీ పథకం అమలు చేయడంపై… రైతుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చల్లార్చేందుకు.. వారికి వచ్చే సందేహాలను.. తీర్చేందుకు ప్రభుత్వం తంటాలు పడుతోంది. ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది. అలాగే.. వైసీపీ నేతలందరూ.. మీడియా ముందుకు వచ్చి 30 ఏళ్లు ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పడం ప్రారంభించారు. రైతుల్లో వ్యక్తమవుతున్న ప్రధాన సందేహం… ప్రభుత్వం జీతాలే సరిగ్గా ఇవ్వలేకపోతోంది.. సబ్సిడీ కరెక్ట్‌గా బ్యాంక్‌లో వేస్తుందా.. అనే. ఒక వేళ అలా వేయకపోతే… విద్యుత్ అధికారులు కరెంట్ కనెక్షన్ తీసేస్తారని… ఆందోళన చెందుతున్నారు. ఈ ఆందోళలనను తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రభుత్వం సమయానికి సబ్సిడీ బ్యాంకుల్లో వేయకపోయినా… కరెంట్ కనెక్షన్ కట్ చేయరని.. ఈ మేరకు విద్యుత్ సంస్థలకు ఆదేశాలు ఇచ్చారని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. నిజానికి ఇలాంటి ఆదేశాలు ఇవ్వడానికి సాధ్యం కాదు. ఒక వేళ ఇచ్చినా చెల్లుబాటు కావు. బిల్లు అంటే బిల్లు.. చెల్లించి తీరాల్సిందే. అయితే.. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై అనుమానాలున్నాయి కాబట్టి… ఒక వేళ ప్రభుత్వం కట్టకపోయినా కనెక్షన్ కట్ చేయరని భరోసా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ రైతుల్లో మరో ఆందోళన పెరుగుతోంది… అదేమిటంటే.. ప్రభుత్వం కట్టకపోతే.. ఆ కనెక్షన్ పేరు మీద ఉన్న విద్యుత్ బకాయిలన్నీ రైతు పేరు మీదే ఉంటాయి. అది రైతులు భారంగా మారడం ఖాయం. ఇవాళ కాకపోతే.., రేపు .. రేపు కాకపోతే ఎల్లుండి ఆ బకాయి.. రైతు పేరు మీదనే ఉంటుంది. ఎప్పటికైనా ఆయనే తీర్చుకోవాల్సి ఉంటుంది. ఇదే రైతుల్ని ఆందోళనకు గురి చేస్తోంది.
ప్రస్తుతం… ప్రతీ వ్యవసాయ కనెక్షన్‌కు మీటర్లు అమరుస్తారు. మీటర్లు అమర్చాలంటే.. ఖచ్చితంగా ఆ రైతు పేరు మీద కనెక్షన్ ఉండాలి. ప్రభుత్వం నగదు బదిలీ చేసేది.. రైతు వ్యక్తిగత అకౌంట్‌కు. రైతు ఆ డబ్బులు తీసుకుంటారో.. తన సొంత డబ్బులతో కడతారో.. ఆయన ఇష్టం.. ఆయన మాత్రం బిల్లు చెల్లించాలి. ప్రభుత్వం కట్టకపోయినా చెల్లించాలి. ప్రభుత్వం ఇవ్వలేదని ఊరుకోవచ్చు.. కానీ ఆ అప్పు ప్రభుత్వం ఖాతాలోకి చేరదు.. రైతు ఖాతాలోకి చేరుతుంది. అంటే.. రైతుల్ని రుణ ఊబిలోకి నెట్టినట్లవుతుంది. అదే.. ఇప్పుడు.. .ఏపీలో ఉన్న రైతులందర్నీ ఆందోళనకు గురి చేస్తోంది.