రఘురామ వ్యవహారాలను ఆయన విచక్షణకే వదిలేస్తున్నామని మంత్రి సురేష్ ప్రకటించారు. రఘురామకృష్ణరాజును అలా వదిలేయాలని వైసీపీ అనుకుంటోందని.. ఇక ఆయన జోలికి వెళ్లకూడదని అనుకుంటోందని అందుకే.. మంత్రి సురేష్తో వైసీపీ పెద్దలే ఇలాంటి ప్రకటనలు చేయించారని భావిస్తున్నారు. రఘురామరాజుపై సురేష్ ఆ ఒక్క వాక్యమే కాదు..మరికొన్ని కామెంట్లు చేశారు.. కన్నతల్లి లాంటి పార్టీని నడిరోడ్డుపైకి ఈడ్చి..హత్యచేసే విధంగా రఘురామ ప్రవర్తిస్తున్నారని… ఇతర పార్టీల నేతల చేతుల్లో కీలుబొమ్మగా మారారని .. సరైన సమయంలో తగిన విధంగా ప్రజలే బుద్ధిచెబుతారని తేల్చారు.
దీంతో.. వైసీపీ ఇక రఘురామకృష్ణరాజు విషయంలో ఎలాంటి అడుగులు వేయబోదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే రఘురామకృష్ణరాజు మాత్రం వెనక్కి తగ్గే ఆలోచనలో లేరు. తాజాగా గవర్నర్ల సదస్సు జరగబోతున్న సమయంలో.. గవర్నర్లందరికీ ఆయన లేఖలు రాశారు. సీఐడీ పెట్టిన కేసు.. అరెస్ట్ వ్యవహారం..తనపై చేసిన ధర్డ్ డిగ్రీ అన్నింటినీ ఏకరవు పెట్టారు. రాష్ట్రపతికి కూడా ఫిర్యాదు చేశానని గుర్తు చేశారు. 124ఏ సెక్షన్ ను రద్దు చేసేలా గవర్నర్ల సదస్సులో చర్చించాలని కోరారు. రఘురామకృష్ణరాజు వ్యూహాత్మకంగా ప్రభుత్వం చేసిన పనిని ప్రతీ రోజూ హైలెట్ చేస్తున్నారు. రొజుకొకరికి చొప్పున లేఖలు రాస్తున్నారు. మీడియాలో ప్రధానంగా వచ్చేలా చేసుకుంటున్నారు. మరో వైపు సీఐడీ అధికారులపై న్యాయపోరాటం కూడా ప్రారంభించారు.
ఈ క్రమంలో కేంద్రం ప్రభుత్వం కూడా.. ఏపీ సీఐడీ తీరు పట్ల ఆగ్రహంతో ఉందన్న అభిప్రాయం రావడంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఇప్పుడు ఆయనను అలా వదిలేస్తామని.. ఇంకేమీ చేయబోమన్న సంకేతాలను మంత్రుల ద్వారా పంపుతోంది. వైసీపీలో ఎవరైనా ఏ అంశంపైనైనా మాట్లాడాలంటే.. ఖచ్చితంగా హైకమాండ్ అనుమతి ఉండాలి.. స్క్రిప్ట్ వస్తేనే మాట్లాడాల్సి ఉంటుంది. లేకపోతే.. మాట్లాడరు. ఈ కారణంగా ఆ వ్యాఖ్యలు సురేష్ వ్యక్తిగతం కాదని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం వదిలి పెట్టినా… రఘురామ వదిలి పెట్టారని అంటున్నారు.