సందట్లో సడేమియా అంటే వైసీపీ నేతలకు బాగా తెలుసు. ఆ పార్టీ మీడియాకు ఇంకా బాగా తెలుసు. ఓ వైపు పెగాసుస్ సాఫ్ట్ వేర్‌తో వ్యక్తిగత స్వేచ్చను హరించేలా ప్రముఖులందరిపై నిఘా పెట్టారని.. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రంపై.. విపక్షాలు పోరుబాట పట్టాయి. పార్లమెంట్లో నిలదీయడం ప్రారంభించారు. సభను జరగనీయడం లేదు. విచారణ చేయించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నాయి. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెబుతున్నాయి. ఈ వ్యవహారం జాతీయ మీడియాలోనూ హైలెట్అవుతోంది. పార్లమెంట్లో పెగాసుస్ వ్యవహారంపై జరుగుతున్న రచ్చను.. జాతీయ మీడియా.. స్థానిక మీడియా మొత్తం కవర్ చేస్తున్నాయి.
అందరూ ఒకటే చెబుతున్నారు. కానీ వైసీపీకి చెందిన మీడియా.. సోషల్ మీడియా.. వారి పార్టీ ఎంపీలు మాత్రం.. సభను తామే స్తంభింపచేస్తున్నామని వాదిస్తున్నారు. పెగాసుస్ అంశం కాదని.. ప్రత్యేకహోదా కోసం తామే ఆ పని చేస్తున్నామని అంటున్నారు. ఈ మేరకు మీడియాలో ప్రకటిస్తారు. తమ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. వారి తీరు చూసి తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు విస్మయం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు వెల్ లోకి కూడా వైసీపీ సభ్యులు వస్తున్న దాఖలాలు కనిపించడం లేదు. వారి వారి స్థానాల్లోనే నిలబడి ఉంటున్నారు.
అయినప్పటికీ…తమ వల్లే సభ వాయిదా పడిందని..ఏపీ ప్రత్యేకహోదా కోసం తాము సభను స్తంభింపచేస్తున్నామని ప్రకటించుకుంటున్నారు.ప్రతిపక్షంలోఉన్నప్పుడు ఏమో కానీ..ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఈ డ్రామాలెందుకన్న విమర్శలు వస్తున్నా పట్టించుకోవడం లేదు. తాము ఏం చెబితే అది నమ్ముతారన్న అతి విశ్వాసం వల్లనే ఇలా ప్రవర్తిస్తున్నారని .. ప్రజల్ని తక్కువ అంచనా వేస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.