ఇడబ్ల్యుసి రిజర్వేషన్ల విషయంలో తొందరపడో? కావాలనో? అడుగు వేసింది వైకాపా. దాన్ని సమర్థించుకోవడానికి తంటాలు పడుతోంది. కోర్టులో కేసుల కారణంగా ఇడబ్ల్యుసి రిజర్వేషన్ల అమలు మొదటికే మోసం వచ్చిందని, అందుకే కాపులకు కోటా తీసి అమలు చేస్తున్నామని చెప్పుకుంటూ వచ్చారు వైకాపా నాయకులు. అదే సమయంలో ఇంకో మాట కూడా అన్నారు. ఆ కోటాలో కాపులకు ఒక్క సీటు లేదా ఒక్క ఉద్యోగం ఇచ్చారా? అని నిలదీసారు చంద్రబాబును.
ఇక్కడే తేడా కొడుతూంది. కోర్టు కేసుల కారణంగా అమలు కుదరడం లేదని చెబుతూ, చంద్రబాబు అమలు చేసారా? అని నిలదీయడం భలే చిత్రంగా వుంది. కానీ ఈ వాదన కూడా చెల్లకుండా చేస్తూ, కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఓ లేఖ రాస్తూ, గుట్టు రట్టు చేసారు.
అసలు ఏ కోర్టులో ఈ రిజర్వేషన్ల వ్యవహారం మీద కేసు వుందో తెలియచేస్తే సంతోషిస్తానంటూ వెటకారం చేసారు. అంతే కాదు, కాపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని దుయ్య బడుతూ, ఆవేదన వ్యక్తం చేస్తూ లేఖ సంధించారు. దాంతో ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. తమ చర్యను సమర్థించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
కానీ చిత్రమేమిటంటే ఒక్క కాపు ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ విషయంలో పెదవి విప్పకపోవడం. అంబటి రాంబాబు లాంటివారు కూడా ఎదురుదాడి చేస్తున్నారు తప్ప, చేసిన పనిని సమర్థిస్తూ పాయింట్ బేస్డ్ గా మాట్లాడడం లేదు.
మొత్తం మీద కాపుల రిజర్వేషన్ విషయంలో వైకాపా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు కనిపిస్తోంది.