రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. కానీ అక్కడా కాస్తంత తెలివిగా వ్యవహరించాలి. లేకపోతే.. మొత్తం తిరిగి వచ్చి.. విమర్శించిన వారికే చుట్టుకుంటాయి. ఈ విషయం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూస్తే అర్థమయిపోతుంది. ఏం జరిగినా… చంద్రబాబుకు లింక్ పెట్టేయాలనుకునే తాపత్రయం… పదే పదే … ఆ పార్టీ నేతల్ని పదే పదే చిక్కుల్లో పడేస్తున్నా.. వారే మాత్రం వెనక్కి తగ్గడం లేదు. చంద్రబాబు ఏం చేసినా తప్పేనని నిరూపించడానికి ప్రయత్నించి తమ నలుపేమిటో బయట పెట్టుకుంటున్నారు. రివర్స్ లో విమర్శలకు గురవుతున్నారు.
ఆంధ్రప్రదేశ్లో గత మూడు రోజులుగా పెథాయ్ తుపాను కేంద్రంగా రాజకీయంగా నడుస్తోంది. తుపాను విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే.. వాటిని పట్టుకుని విమర్శించాల్సిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. పదే పదే ఒకటే ఆరోపణ చేస్తున్నారు. అదేమిటంటే… చంద్రబాబు.. తుపాను వస్తే.. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకారొత్సవానికి వెళ్లారనేది..ఆ విమర్శ. పాపం..రాజకీయాలకు కొత్త అందుకే అలాంటి విమర్శలు చేస్తున్నారని టీడీపీ నేతలు.. మొదట్లో లైట్ తీసుకున్నారు కానీ.. పదే పదే ఆ విమర్శ చేస్తూండటంతో.. సూటిగా కౌంటర్ ఇచ్చారు. ” తిత్లీ తుపాను దెబ్బకు సిక్కోలు ప్రజలంతా కష్టకష్టాలు పడుతూంటే… పక్క జిల్లాలో ఉండి కూడా పరామర్శిచని.. జగన్ , వైసీపీ నేతలు..ఇలాంటి విమర్శలు చేయడమేమిటని” విరుచుకుపడ్డారు. చివరికి చంద్రబాబుకు కూడా అదే సెటైర్ వేశారు. దాంతో వైసీపీ నేతలకు గాలిపోయినట్లయింది. ప్రభుత్వ పరంగా ఏమైనా తప్పులుంటే చెప్పాలి గానీ.. ఇలా విమర్శించడానికే ఓ కారణం పట్టుకుంటే ఇలా ఉంటుందని వైసీపీలోనే గుసగుసలు వినిపించాయి.
ఇది ఒక్కటే కాదు.. కొద్ది రోజుల కిందట.. కూకట్పల్లిలో నందమూరి సుహాసిని ఓటమి తర్వాత కూడా… ఇదే తరహా ఆరోపణలతో ఇరుక్కుపోయారు. ఓడిపోతారని తెలిసి కూడా చంద్రబాబు సుహాసినికి అక్కడ సీటిచ్చారని విమర్శలు గుప్పించారు. హరికృష్ణ కుటుంబాన్ని అవమానించారని లేనిపోని సానుభూతి చూపించారు. వెంటనే టీడీపీ నేతలు.. విజయమ్మ విశాఖలో ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేసి.. ” అంటే .. జగన్ కన్న తల్లినే అవమానించారన్న మాట.. హవ్వ..” అని బుగ్గలు నొక్కుకున్నారు. బాబాయ్ ని ఎమ్మెల్సీగా గెలిపించలేని జగన్ చేతకాని తనాన్ని… వైసీపీ తరహాలోనే జగన్ చేసిన అవమానంగా తేల్చారు. దాంతో.. వైసీపీ నేతలు.. ఆ విషయంలో సైలెంట్ కావాల్సి వచ్చింది. ఇవి ఇటీవలి కాలంలో చేసుకున్న విమర్శల సెల్ఫ్ గోల్సే…! . ప్రత్యేకంగా టీడీపీని విమర్శించడానికి కాకుండా.. తమను కూడా అలా విమర్శించవచ్చని… టీడీపీకి ఐడియాలిస్తున్నట్లుగా ఉన్నాయి.. వైసీపీ నేతల తీరు..!