వైసీపీ ఎమ్మెల్యే గెలవడానికి సహకరించి తప్పు చేశానని బహిరంగంగా తనను తాను చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి, నర్సాపురం సీనియర్ నేత కొత్తపల్లి సుబ్బారాయుడ్ని వైసీపీ తమ పార్టీ నుంచి గెంటేసింది. కొద్ది రోజుల కిందట నర్సాపురం ను జిల్లా కేంద్రం చేయాలని ఆయన చేపట్టిన నిరసనలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుపై విమర్శలు చేశారు. ఆయనను గెలిపించినందుకు తనను తాను చెప్పుతో కొట్టుకున్నారు. ఈ అంశం సంచలనం సృష్టించింది.
ఆ తర్వాత కూడా జిల్లా సాధన ఉద్యమం చేసింది. ఎమ్మెల్యే ప్రసాదరాజుపై విమర్శలు గుప్పించారు. అప్పట్నుంచి ఆయనను పార్టీలో దూరం పెడుతున్నారు. అయితే ఇటీవల నర్సాపురం నియోజకవర్గంలో ఆయన దూకుడు పెంచారు. సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసి తీరుతానని ప్రకటించారు. అయితే ఏ పార్టీ అన్నది ఆయన చెప్పడం లేదు. దీంతో ఇతర పార్టీలతో ఆయన టచ్లో ఉన్నారేమోనని వైఎస్ఆర్సీపీ నాయకులు అనుమానంలో పడ్డారు. జనసేనతో చర్చల్లో ఉన్నారన్న సమాచారం రావడంతో ఆయనను పార్టీ నుంచి బయటకు పంపేసినట్లుగా తెలుస్తోంది.
కొత్తపల్లి సుబ్బారాయుడు మొదటగా తెలుగుదేశం పార్టీ నేత. ఆ పార్టీలో మంత్రిగా కూడా వ్యవహరించారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరారు. మళ్లీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. మళ్లీ వైసీపీకి వెళ్లారు. తర్వాత టీడీపీకి వచ్చి కాపు కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. ఎన్నికలకు ముందు వైసీపీకి వెళ్లారు. ఇప్పుడు ఆయనకు జనసేన ఒక్కటే మిగిలింది.