రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి దానిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉంటారు. ప్రతిపక్షంలో ఉన్న ఏ పార్టీకయినా అది సర్వసాదారనమయిన విషయమే కానీ ఆ అసంతృప్తిని వ్యక్తం చేయడానికి ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రం అని చెప్పుకోదగ్గ అవిశ్వాస తీర్మానాన్ని తరచూ బయటకు తీసి వాడాలని జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించడం దానిని దుర్వినియోగం చేస్తున్నట్లే భావించవలసి ఉంటుంది. అంతేకాదు ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నుకోబడిన ప్రజాప్రభుత్వాలని కూల్చే ప్రయత్నాలు చేయడం కూడా చాలా తప్పు.
గతంలో సమైక్యరాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్ ఇటువంటి ప్రయత్నాలు చేసారు కానీ భంగపడ్డారు. మళ్ళీ ఇప్పుడు కూడా ప్రజా ప్రభుత్వాన్ని కూల్చేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి అధికార పార్టీ సభ్యులనే తమతో చేతులు కలపమని శాసనసభ ముందు నిలబడి ఆ పార్టీ ఎమ్మెల్యేలు కోరడం చాలా తప్పు. జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయిపోవాలనే చాలా కోరికగా ఉండవచ్చును కానీ అందుకు ఇది సరయిన పద్ధతి కాదు. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వాలని కూలిపోతాయని జోస్యం చెపుతుండటం లేదా వాటిని కూల్చివేస్తానని బెదిరిస్తుండటం ఒక ప్రధానప్రతిపక్ష నేత అనదగ్గ మాటలు కావు.
ఆయనకు చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వం పనిచేస్తున్న తీరు నచ్చకపోవచ్చును కానీ అంతమాత్రన్న ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టనవసరం లేదు. తెదేపా ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని భావిస్తే, సాక్షాధారాలతో సహా దానిని శాసనసభలో నిలదీయవచ్చును. అక్కడ తన మాటను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భావిస్తే ఆ సాక్ష్యాధారాలను న్యాయస్థానాలకు సమర్పించి ప్రభుత్వాన్ని నిలదీయవచ్చును. కానీ ఈవిధంగా తరచూ అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతుండటం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి దానిని ఒక ఆటగా భావిస్తునట్లనిపిస్తోంది.
ఆయన మొదట స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం పెడతామన్నారు. ఇప్పుడు ఏకంగా ప్రభుత్వంపైనే పెడుతున్నారు. శాసనసభలో తమకు బలం లేని కారణంగా ఆ తీర్మానం వీగిపోతుందని తెలిసి ఉన్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డి దుందుడుకుగా ముందుకె సాగుతున్నారు. ఆయన ప్రదర్శిస్తున్న ఇటువంటి దుందుడుకుతనం వలన ఇప్పటికే ఆయనతో సహా వైకాపా నేతలు కూడా చాలాసార్లు అవమానకర పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది. అయినా వాటి నుండి ఆయన ఎటువంటి గుణపాఠాలు నేర్చుకోలేదని అర్ధమవుతోంది. అందుకే మళ్ళీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు తహతహలాడుతున్నారు. కనుక వైకాపా ఎమ్మెల్యేలు అందరూ మళ్ళీ మరోసారి పరాభవానికి సిద్దం కావలసి ఉంటుంది. ఈ అవిశ్వాస తీర్మానం వలన అంతకంటే జరిగేది మరేమీ ఉండబోదు.