తెలంగాణాలో తెరాస ధాటికి తెదేపాతో సహా ప్రతిపక్షాలన్నీ క్రమంగా నిర్వీర్యమయిపోతున్నాయి. తెలంగాణాలో వైకాపా ఉన్నా లేనట్లే లెక్క ఎందుకంటే అది ఏనాడూ ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడిన దాఖలాలు లేవు. కారణాలు అందరికీ తెలిసినవే. చివరికి దానికున్న ముగ్గురు ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎప్పుడో తెరాసలో చేరిపోయారు. మిగిలిన ఒక్కరూ కూడా ఏదో ఒకరోజు తెరాసలోకి జంప్ చేసేసినా ఆశ్చర్యం లేదు. తెలంగాణాలో బలపడాలని వైకాపాకి ఆసక్తి లేదు కనుక అక్కడ పార్టీ పరిస్థితి ఎలాగున్నా అది పట్టించుకోకపోవచ్చును. కానీ ఆంధ్రాలో ఎప్పటికయినా ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్న జగన్మోహన్ రెడ్డి, తన కళ్ళముందే పార్టీ కరిగిపోతుంటే ఏమీ చేయలేకపోతున్నారు. ఇప్పటికే 10 మంది వైకాపా ఎమ్మెల్యేలు తెదేపాలోకి వెళ్లిపోయారు. తెదేపా టార్గెట్ వైకాపాని ఖాళీ చేసేయడం అని నిర్మోహమాటంగా చెప్పుకొంటోంది కనుక ఆ పనేదో పూర్తి చేసేవరకు వైకాపాని విడిచిపెట్టక పోవచ్చును. ఇప్పటికే దాని కడప కంచుకోటకి బీటలు పడ్డాయి. వైకాపాకి బలం ఉన్న రాయలసీమలోనే దానిని పూర్తిగా దెబ్బతీయాలనే లక్ష్యంతో తెదేపా ముందుకు సాగుతోంది. ఒకవేళ ఆంధ్రాలో కూడా వైకాపా దెబ్బయిపోతే అప్పుడు ఆ పార్టీ పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి కావాలనుకొన్న జగన్ పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగక మానదు. కనుక పరిస్థితి అంతవరకు రాకుండా జగన్మోహన్ రెడ్డి ముందే జాగ్రత్త పడితే మంచిది.