వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన.. జగన్ ముఖ్యమంత్రిత్వం ఎంత దరిద్రంగా సాగాయన్నదానికి ఆ పార్టీ ఇప్పుడు ఎదుర్కొంటున్న దుస్థితే సాక్ష్యం. తమ పరిపాలనా కాలంలో తీసుకున్న నిర్ణయాలను తప్పు పడుతూ…వాటిని రద్దు చేయాలనే తామే పోరాడుతున్నారు. ఇంత కన్నా దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఘోరమైన అవమానం ఏముంటుంది ?. తమను తామే తప్పు పట్టుకుంటూ రాజకీయాలు ఎవరైనా చేయగలరా?. ఒక్క వైసీపీ తప్ప.
ముంతాజ్ హోటల్‌కు అనుమతి ఇచ్చిందెవరు ? రద్దు చేస్తే హర్షం వ్యక్తం చేస్తోందెవరు ?
తిరుపతిలో ముంతాజ్ అనే హోటల్ నిర్మాణానికి జగన్ అనుమతి ఇచ్చారు. అలిపిరిలో ముంతాజ్ హోటల్ ఏమిటని..విమర్శలు వచ్చినా పట్టించుకోలేదు. ఏకంగా 90 ఏళ్లకు లీజుకు ఇచ్చేశారు. నిర్మాణాలు ప్రారంభించారు. అప్పట్లో ఒక్క వైసీపీ నేత కూడా మాట్లాడలేదు. టీడీపీ రాగానే.. ముంతాజ్ హోటల్ అనుమతులు రద్దు చేయాలని .. అక్కడ అలాంటి హోటల్ నిర్మాణం శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయడమేనన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అనుమతుల్ని రద్దు చేస్తే సంబరాలు చేసుకుంటున్నారు. ఇంత కన్నా అవమానం ఆ పార్టీ నేతలకు ఇంకేముంటుంది?
తామే పెంచి పోయిన విద్యుత్ చార్జీలపై ఉద్యమం
వైసీపీ హయాంలో విద్యుత్ చార్జీలను పెంచారు. పోతూ పోతూ కూడా.. తర్వాత రోజుల్లో పెంచాల్సిన చార్జీలకు కూడా ఏపీఈఆర్సీ ద్వారా గ్రీన్ సిగ్నల్ ఇప్పించి వెళ్లారు. ఆ ప్రకారం ప్రజలపై ట్రూ అప్ చార్జీలు పడ్డాయి. అయితే ఇవి టీడీపీ ప్రభుత్వం పెంచిందంటూ .. పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి రాజకీయం చేయబోయారు. సామాన్య ప్రజలకు తెలియదేమో కానీ.. అసలు నిజం ఏమిటో ఎవరికీ తెలియకుండా ఉంటుందా?. ఇంత ఘోరమైన పరిస్థితి ఎందుకని బొత్స లాంటి వాళ్లు సిగ్గుపడి..మేము పెంచితే మీరు తగ్గించవచ్చు కదా అని వితండవాదం చేసుకున్నారు. అలా ఉంటుంది వైసీపీ రాజకీయం.
పిల్లల ఫీజులపైనా అదే నిర్వాకం
జగన్ రెడ్డి పిల్లల ఫీజుల్ని తల్లుల ఖాతాల్లో వేస్తున్నామని బటన్లు నొక్కారు. సాక్షి పత్రికల్లో పెద్ద ఎత్తున ప్రకటనలు ఇచ్చారు. వాటికి డబ్బులు చెల్లించారు కానీ ఫీజులు విడుదల చేయలేదు. నాలుగు వేల కోట్లకుపైగా బకాయి పెట్టి పోయారు. వాటిని విడుదల చేయాలని ధర్నాలు చేశారు. అందరూ ఇదేం పద్ధతని మొహం మీదనే ఖాండ్రించే పరిస్థితి రావడంతో చివరికి ఫీజు పోరు కాస్తా యువత పోరు అని మార్చుకున్నారు. కానీ వైసీపీ భావ…రాజకీయ దారిద్ర్యం అందరికీ అర్థమైపోయింది. ఇలాంటి పార్టీ దేశంలో మరొకటి ఉండదని అనుకుంటున్నారు.