వైసీపీ సోషల్ మీడియాలో కామెడీ అయిపోతోంది. ఓ సినిమాలో బ్రహ్మానందం టైపులో చేతకాని దొంగలా .. ఎప్పటికప్పుడు ఇట్టే దొరికిపోతోంది. లోకేష్ పాదయాత్ర విషయంలో ప్రత్యేకంగా అటు ఫీల్డ్ లో ఇటు.. ఆఫీసులో కనీసం రెండు వందల మందిని పెట్టి ప్రతీ అడుగూ పరిశీలిస్తున్నారు. ప్రతీ మాట విశ్లేషిస్తున్నారు. అదనంగా ఇంటలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారు. అయితే ట్రోల్ చేయడానికి ఏమీ దొరకడం లేదేమో కానీ పూర్తి స్థాయిలో ఫేక్ ను నమ్ముకుంటున్నారు. పోనీ అదయినా సీరియస్ గా నమ్మేలా చేస్తున్నారంటే.. వైసీపీ నేతలు కూడా నవ్వుకుంటున్నారు. ఇది ఫేక్ అని వారికి కూడా సులువుగా అర్థమైపోతుంది మరి.
నారా లోకేష్ దళితుల్ని ఏదో అన్నారని వైసీపీ సోషల్ మీడియా ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసిన ఎవరికైనా ఎడిట్ చేసింది కదా అనుకుంటారు. కానీ వైసీపీ సోషల్ మీడియా చూస్తున్న ఇంచార్జ్ సజ్జల భార్గవ మాత్రం తను గొప్ప ఘనకార్యం చేశాననుకుని తమ మూకకు రిలీజ్ చేశారు. తీరా అసలు విషయం చాలా వేగంగా స్ప్రెడ్ అయింది. వైసీపీ పూర్తిగా ఫేక్ ల మీద ఆధారపడుతోందని ఆ పార్టీ పనైపోయిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఫేకులతో మాత్రమే కాదు… కొన్ని సీరియస్ స్ట్రాటజీల విషయంలోనూ వైసీపీ సోషల్ మీడియా తేలిపోతోంది. చివరికి తాము హైర్ చేసుకున్న సెలబ్రిటీ ట్విట్టర్ అకౌంట్ల నుంచి వాటిని పోస్టు చేయించి వారినీ బద్నాం చేయిస్తున్నారు. జగన్ నడిచాడు… ఎగిరాడు.. గెంతాడు.. అంటూ గతంలో హీరో ఎలివేషన్లు ఇచ్చుకునేవారు. లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడు. అవన్నీ కామన్. అయితే లోకేష్ కాపీ చేస్తున్నాడని ఓ వీడియో తయారు చేసి వదిలారు. దీన్ని చూసి సామాన్యులు కూడా అంటే… జగన్ గాలి పిల్చాడని.. ఇతరులు గాలి పీలిస్తే అది కాపీ కొట్టినట్లేనా అని సెటైర్లు వేస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇవ్వడం… ఆత్మీయంగా మాట్లాడటం కూడా జగనే ఫస్ట్.. లోకేష్ కాపీ అన్నట్లు వీడియో చేసి చివరికి ఆర్జీవీ అకౌంట్ నుంచి కూడా పోస్ట్ చేయించారు. ఈ వీడియో పై ప్రజాభిప్రాయం అనాలసిస్ చేసుకుంటే సజ్జల భార్గవ ఎంత దారుణమైన భావదారిద్ర్యంలో ఉన్నారో అర్థమైపోతుంది.
వైసీపీలో పెరిగిపోతున్న అసహనానికి ఆ పార్టీ సోషల్ మీడియా వ్యవహారమే పెద్ద ఉదాహరణగా కనిపిస్తోంది. ఏదో ఒకటి చేయాలని.. ఫేక్ చేసి దొరికిపోతున్నారు. చట్టాలు వారికి వర్తించకపోవచ్చు కానీ.. ప్రజలకు దొరికిపోతున్నారు. వారు వేసే శిక్ష ఊహించనంతగా ఉంటుంది.