ఏపీలో రోడ్లు బాగాలేవు.. కరెంట్ లేదు.. అక్కడ నరకంగా మారిపోయిందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సోషల్ మీడియా అంతా కలసికట్టుగా ప్రతీకారం తీర్చుకుంటోంది. ఏ మాత్రం కనికరం లేకుండా దారుణమైన ట్రోలింగ్స్‌కు పాల్పడుతున్నారు. వారి ట్రోలింగ్‌కు దొరికిన కారణం హైదరాబాద్‌లో అర్థరాత్రి కురిసిన అకాల వర్షం. హైదరాబాద్‌లో అర్థరాత్రి రెండు, మూడు గంటల పాటు జడివాన కురిసింది. హైదరాబాద్ రోడ్లపై సహజంగానే ఆ వర్షం కాసేపు నిలిచి ఉంటుంది. అరగంట తర్వాత చుక్క కూడా కనిపించదు. కానీ ఈ లోపే ఫోటోలు , వీడియోలను వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ… రకరకాల విమర్శలు చేస్తున్నారు.
నాలుగు రోజుల కిందట ఏపీపై విమర్శలు చేశారని..ఇప్పుడు హైదరాబాద్ దుస్థితేమిటని ప్రశ్నించడం ప్రారంభించారు. చివరికి వైసీపీ సోషల్ మీడియాలోనే అత్యంత జుగుప్సాకరంగా ట్వీట్లు పెట్టే వారు కూడా మనం బురదలో ఉన్నప్పుడు పాటలు పాడకూడదంటూ కేటీఆర్‌పై దారుణమైన ట్రోలింగ్‌కు పాల్పడుతున్నారు. వైసీపీ హైకమాండ్ పర్మిషన్ లేకుండా కేటీఆర్ పై దారుణంగా విరుచుకుపడే సాహసాన్ని ఆ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు చేయరు. వారి అనుమతితోనే కేటీఆర్ పై సోషల్ మీడియా ద్వారా ఎటాక్ చేశారని భావిస్తున్నారు.
కేటీఆర్ పై నేరుగా ఎటాక్ చేయడానికి సజ్జల వంటి వారు
వెనుకాడుతున్నారు. అయితే సోషల్ మీడియాలో అయితే నెటిజన్ల మీద తోసేయవచ్చు. కానీ టీఆర్ఎస్ కు కూడా అంతకు మించి సోషల్ మీడియా సైన్యం ఉందన్న సంగతిని వైసీపీ నేతలు మర్చిపోతున్నారని అంటున్నారు. మొత్తానికి కేటీఆర్ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మెల్లగా సీన్ మారిపోతున్న సూచనలు కనిపిస్తున్నాయి.