ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడాన్ని నిరసిస్తూ వైకాపా నేడు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తోంది. జిల్లాలు, మండలాల వారిగా పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు, కార్యకర్తలు అందరూ ఈ ధర్నా కార్యక్రమాలను విజయవంతం చేయడానికి గట్టిగా కృషి చేస్తున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో జరిగే ధర్నా కార్యక్రమంలో వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొని ప్రసంగిస్తారు.
గత రెండు నెలలుగా పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో సతమతమవుతున్న జగన్మోహన్ రెడ్డి, పార్టీలో మిగిలినవారిని కాపాడుకోవడంపైనే దృష్టి పెట్టడంతో వేరే కార్యక్రమాలేవీ పెద్దగా చేపట్టలేకపోయారు. డిల్లీ యాత్ర ముగించుకొని రాగానే తెలంగాణాలో ఎత్తిపోతల పధకాలను నిరసిస్తూ మే 16,17,18 తేదీలలో కర్నూలులో నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించేశారు. వెనువెంటనే ఈ కరువు అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాల కార్యక్రమం మొదలుపెట్టడం గమనిస్తే మళ్ళీ చాలా రోజుల తరువాత వైకాపా తన రోటీన్ కార్యక్రమాలు మొదలుపెట్టినట్లు కనబడుతోంది. తద్వారా ఎమ్మెల్యేల ఫిరాయింపులతో పార్టీపై ఎటువంటి ప్రభావం పడలేదనే సంకేతాలు పార్టీలో ఉన్నవారికి, ప్రజలకి, ప్రభుత్వానికి పంపదలచుకొన్నట్లు భావించవచ్చు. అది పార్టీ నేతల, కార్యకర్తల ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు దోహదపడుతుంది కనుక అది మంచి ఆలోచనే అని చెప్పవచ్చు.
ఇదివరకు జగన్మోహన్ రెడ్డి ఏదయినా అనుకొంటే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా దానిపై వెంటనే నిరాహార దీక్షలకి కూర్చోండిపోయేవారు. తన ధర్నాలు, దీక్షలలో ప్రజలను కూడా భాగస్వాములుగా చేయడానికి గ్రామస్థాయి నుంచి కార్యక్రమాలను రూపొందించుకొని, అమలుచేయడంపై పెద్దగా శ్రద్ధ పెట్టేవారు కాదు. తత్ఫలితంగా అయన పోరాటాలకి ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాకపోవడంతో జగన్ పని వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు అయ్యేది. కానీ ఈసారి తను మే 16 నుంచి చేపట్టబోయే మూడు రోజుల నిరాహార దీక్షకి గ్రామస్థాయి నుంచి ప్రజలను కూడా భాగస్వాములు అయ్యే విధంగా ప్రణాళిక రూపొందించుకొన్నట్లు కనబడుతోంది. ఆలస్యంగానయినా జగన్మోహన్ రెడ్డి ఈ విషయం తెలుసుకొన్నారు కనుక ఇదేవిధంగా ప్రజలని, పార్టీలో ఉన్నవారినీ అందరినీ కలుపుకొని ఆయన ముందుకు సాగినట్లయితే, ఆశించిన ఫలితాలు దక్కవచ్చు.