ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తెగేసి చెప్పడంతో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు మళ్ళీ నిరసనలు తెలియజేయడం మొదలుపెట్టాయి. ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ నిన్నటి వరకు అనంతపురంలో నిరాహార దీక్ష చేసారు. ఆయనకి వైకాపా మద్దతు ఈయలేదు కానీ ఈరోజు అది తలపెట్టిన రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలకు అధికార తెదేపాతో సహా అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కలెక్టరేట్ల ముట్టడికి వైకాపా సిద్దం అవుతోంది. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడలో కలక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో పాల్గొంటారు. అందుకు జిల్లా నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు.
ప్రత్యేక హోదా కోసం వైకాపా ఉద్యమించడాన్ని ఎవరూ తప్పు పట్టరు కానీ, దాని కోసమే చలసాని శ్రీనివాస్ లేదా కాంగ్రెస్ పార్టీ చేసే ఉద్యమాలకి వైకాపా ఎందుకు మద్దతు ఇవ్వదు? అని ఆలోచించినప్పుడు దాని నిబద్దతపై అనుమానం కలుగక మానదు. వైకాపాకి నిజంగా ప్రత్యేక హోదా సాధించాలనే తపన, చిత్తశుద్ధి ఉన్నట్లయితే దాని కోసం రాష్ట్రంలో పోరాడుతున్నవారందరికీ మద్దతు ఇచ్చి వారిని కూడా తన ఉద్యమంలో భాగస్వాములుగా చేసుకొని పోరాడవచ్చు కానీ ‘ఇతరుల ఉద్యమాలతో మాకు సంబంధం లేదు. మా ఉద్యమమే అందరికంటే గొప్ప ఉద్యమం కనుక అందరూ మాకే మద్దతు ఇవ్వాలని’ వైకాపా కోరడం దాని నిబద్దతను ప్రశ్నించేలా చేస్తోంది. పైగా దాని కోసం జగన్మోహన్ రెడ్డి ఇదివరకు ఒకసారి గుంటూరులో వారం రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేశారు. ఆ తరువాత మళ్ళీ ఇంతవరకు ఆ ఊసే ఎత్తలేదు. అప్పటి నుంచి ఆ ఉద్యమాన్ని జగన్ కొనసాగించి ఉండి ఉంటే, ప్రజలకి అయన చేస్తున్న ఉద్యమంపై నమ్మకం కలిగి ఉండేది. కానీ అలాగా చేయకుండా దానిపై రాష్ట్రంలో మళ్ళీ వేడి పుట్టినప్పుడే ఉద్యమాలు చేస్తుండటం వలన ఆయన ప్రత్యేక హోదా కోసం కాక ప్రజలను ఆకట్టుకోవడానికే ఉద్యమిస్తున్నట్లు అనుమానించవలసి వస్తోంది. ఇది జగన్ చెప్పుకొనే ‘విశ్వసనీయత’ ని ప్రశ్నార్ధకంగా మార్చుతుందని గుర్తిస్తే మంచిది.