వైకాపా ఎమ్మెల్యే రోజా విషయంలో ఆ పార్టీ చాలా తప్పటడుగులు వేస్తునట్లే కనబడుతోంది. ముఖ్యమంత్రితో అనుచితంగా ప్రవర్తించినందుకు ఆమెను సభ నుంచి సస్పెండ్ చేయబడినప్పుడు ఆమె స్పీకర్ కి క్షమాపణలు చెప్పుకొని ఉండే ఆమెపై సస్పెన్షన్ ఎత్తివేసి ఉండేవారేమో? కానీ ఆవిధంగా చేయకుండా, ఆమెను వెనకేసుకొని వస్తూ తెదేపాపై ఎదురు దాడికి దిగడం వలన సమస్య ఇంకా జటిలం చేసుకొన్నారు. ఒకవేళ రోజా వైఖరిలో మార్పు వస్తే ఆమెపై సస్పెన్షన్ విషయం గురించి పునరాలోచిస్తామన్నట్లు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడారు. ఆ అవకాశాన్ని కూడా కాలదన్నుకొని న్యాయపోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి సభని బహిష్కరించి వెళ్ళిపోయారు.
శాసనసభలో తీసుకొనే ఎటువంటి నిర్ణయాలని న్యాయస్థానాలు కూడా ప్రశ్నించలేవనే సంగతి జగన్మోహన్ రెడ్డికి తెలియదనుకోలేము. తెరాసలో చేరిన తెదేపా, వైకాపా కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ఆ పార్టీల నేతలు సుప్రీం కోర్టు వరకు వెళ్ళినా స్పీకర్ పరిధిలో ఉన్న అంశాలలో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన విషయం ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. కనుక రోజా సస్పెన్షన్ విషయంలో కూడా అదే జరుగవచ్చును. ఒకవేళ జగన్ కి ఈ విషయం తెలియదనుకొన్నా మంత్రి యనమల రామకృష్ణుడు సభలో ఆయనకి తెలియజేసినప్పుడయినా మేల్కొని ఉండాలి. కానీ మేల్కొనలేదు. మేల్కొనలేదు అనేకంటే మేల్కొనడానికి ఇష్టపడలేదు అని చెప్పాలేమో?
ఎందుకంటే స్పీకర్ కి క్షమాపణలు చెప్పుకొని సస్పెన్షన్ ఉపసంహరించుకోవడం వలన తెదేపాకు చులకనవుతామనే భయం ఉంది. అదీ కాక ముఖ్యమంత్రి పట్ల సభలో అనుచితంగా వ్యవహరించినట్లు అంగీకరించినట్లవుతుంది. అందుకే ఈ వ్యవహారంలో తమదే తప్పని తెలిసి ఉన్నప్పటికీ, న్యాయస్థానంలో తమకేసు నిలవదని తెలిసి ఉన్నప్పటికీ న్యాయపోరాటం చేస్తామని చెపుతున్నారనుకోవాల్సి ఉంటుంది. కానీ ఆవిధంగా చేయడం వలన అధికార పార్టీని ఏడాదిపాటు నిందించడానికి వైకాపాకు అవకాశం కలుగుతుంది. ఆ సాకుతో స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని వైకాపా భావిస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చేయి. కానీ ఆ పని వచ్చే సమావేశాలలో చేయాలనుకొంటున్నట్లు వార్తలు వచ్చేయి కనుక అంతవరకు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం అనే అంశంపై కూడా మాట్లాడుకొనే అవకాశం దక్కుతుంది.
అయితే రాష్ట్రానికి పెద్దవాడయిన ఒక ముఖ్యమంత్రి పట్ల అనుచితంగా మాట్లాడి, న్యాయపోరాటం చేస్తే ఓడిపోతామని తెలిసి కూడా అందుకు సిద్దపడటం, స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచన చేయడం, ఆ తీర్మానాన్ని నెగ్గించుకోలేక ఓడిపోతే మళ్ళీ దాని వలన ప్రజలలో నవ్వులపాలవుతామనే విషయం వైకాపా గ్రహించకపోవడం చాలా విచిత్రంగా ఉంది. ప్రస్తుతం ఆవేశంలో ఏదో ప్రకటించేసినా తరువాత వాటన్నిటి పై పునరాలోచించుకొంటుందేమో? చూడాలి.