ఆత్మకూరు ఉపఎన్నికకు నామినేషన్లు ప్రారంభమయ్యాయి. కొంత మంది ఇండిపెండెంట్లు నామినేషన్లు వేస్తున్నారు. బీజేపీ కూడా ఐదుగురితో ఓ ఎన్నికల కమిటీని నియమించింది. నిజానికి ప్రధాన పార్టీలు అంటే టీడీపీ, జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా లేవు. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నా.. అలాంటి మొహమాటాలేమీ పెట్టుకోకుండా బీజేపీ ఏకపక్షంగా పోటీ చేస్తామని ప్రకటించింది. ఇప్పుడు జనసేన మద్దతిస్తుందా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. బద్వేలు సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు … కుటంబసభ్యులకే టిక్కెట్ ఇవ్వడంతో తాము పోటీ చేయబోవడం లేదని జనసేన అధినేత ప్రకటించారు.
ఇక్కడ కూడా మేకపాటి కుటుంబమే పోటీ చేస్తున్నందున జనసేన పోటీ చేసే చాన్స్ లేదని తెలుస్తోంది. టీడీపీ కూడా ఇప్పటికే పోటీ చేయడం లేదని ప్రకటించేసింది. దీంతో బరిలో ఉండే ప్రధాన పార్టీ బీజేపీనే అవుతుంది. కానీ ఇక్కడ పోటీ చేయడానికి బీజేపీ అభ్యర్థి లేరు. ఇతర పార్టీలు పాల్గొనకపోతే… ఎవరో ఒకర్ని నిలబెట్టడం ఖాయమే. వైసీపీ కూడా పోటీ జరగాలనే కోరుకుంటోంది. లక్షకుపైగా మెజార్టీ సాధించి.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేక ఉందని తమపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించాలనుకుంటోంది.
ప్రధాన పార్టీలు పోటీ చేయకపోయినా చెప్పుకోవడానికి బాగుంటుందని ఆ పార్టీ ఆ వ్యూహంలో ఉంది. అందుకే.. బీజేపీ కూడా ఉత్సాహంగానే ఉంది. అయితే బీజేపీ హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ.. మొత్తంగా అయితే.. వైసీపీ వ్యూహం పోటీ ఉండాలి.. లక్ష మెజార్టీ దాటాలి అన్నట్లుగా ఉంది.