వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ .. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ విషయంలో.. చాలా మర్యాదగా వ్యవహరిస్తున్నట్లుగా… బయటకు రాజకీయం వ్యూహం అమలు చేస్తోంది. కేంద్రం.. ఈ రెండు నెలల కాలంలో.. ఎన్నో సార్లు.. ఏపీ సర్కార్‌కు.,. జగన్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నేరుగా ప్రకటనలు చేసింది. జగన్‌పై.. రామ్‌మాధవ్ లాంటి వాళ్లు తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం.. బీజేపీ విషయంలో.. వినయ విధేయ రామ అన్నట్లుగా ఉంది. ప్రతి విమర్శలు చేయడం లేదు. అత్యంత హుందాగా వ్యవహరిస్తోంది. తమపై విమర్శలు చేసిన నేతలను కూడా.. పెద్దగా టచ్ చేయడం లేదు. అలా అని.. నిర్ణయాల విషయంలో.. దూకుడు ఏమీ తగ్గించడం లేదు.
మొదటగా కరెంట్ కొనుగోలు ఒప్పందాల విషయంలో… కేంద్ర ప్రభుత్వం.. ఏపీ సర్కార్ కు… లేఖ రాసింది. సమీక్షల్లాంటి పనులు చేయవద్దని సూటిగానే చెప్పింది. అయితే జగన్మోహన్ రెడ్డి లక్ష్య పెట్టలేదు. తాను మోడీతోనే మాట్లాడానని… ఎవరినీ పట్టించుకోవద్దని.. ఆయన దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో.. కేంద్రం నుంచి మరో సీరియస్ లేఖ వచ్చింది. అయినప్పటికీ.. జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ విషయంలోనూ అదే జరిగింది. అక్రమాలేమీ జరగలేదని.. కేంద్రం పార్లమెంట్ సాక్షిగా .. సర్టిఫికెట్ ఇవ్వడంతో… జగన్ అయోమయానికి గురైనా… ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. తన దారిలో తాను వెళ్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన.. పోలవరం కాంట్రాక్టుల్ని.. కేంద్రంతో సంబంధం లేకుండా రద్దు చేసేశారు. దీనిపై.. కేంద్ర జలశక్తి మంత్రి కూడా.. నోరెళ్ల బెట్టాల్సి వచ్చింది.
ఓ వైపు.. అత్యంత వినయం ప్రదర్శిస్తూ.. మరో వైపు.. వైసీపీ.. ఇలా కేంద్రం అంటే లెక్కలేనట్లుగా వ్యవహరిస్తూండటంతో బీజేపీ నేతలకు.. తేడా కొడుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అందుకే.. జగన్ డబుల్ గేమ్ ఆడుతున్నాడన్న ఉద్దేశంతో… ఏపీ సర్కార్ పై.. బీజేపీ నేతలు దూకుడు పెంచారు. అదే సమయంలో.. తాము.. జగన్ సర్కార్ నిర్ణయాలపై సమీక్షలు చేస్తామంటూ… పార్టీ నేతలతో ప్రకటనలు ఇప్పిస్తున్నారు.. బీజేపీ పెద్దలు. జగన్ ప్లాన్‌కు విరుగుడు రెడీ చేశామని.. బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. మొత్తానికి.. బీజేపీ – జగన్ మధ్య … అప్పట్లో ఉన్నంత స్నేహబంధం ఇప్పుడు లేదని మాత్రం తాజా పరిణామాలతో స్పష్టమవుతోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.