జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే.. తాము వాలంటీర్ ను నిలబెట్టి గెలిపిస్తామని.. వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు . పొత్తులో కలిసి వస్తే వాలంటీర్ ను నిలబెడతామని.. ఓడిస్తామని మాత్రం చెప్పడం లేదు. ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎంత అడ్వాంటేజ్ ఉంటుందో.. వైసీపీకి బాగా తెలుసని.. జోగి రమేష్ మాటలతో ఎవరికైనా అర్థమైపోతుంది.
పవన్ కల్యాణ్ వారాహియాత్రకు మంచి స్పందన వస్తుంది. అందులో సందేహం లేదు. నిజానికి పవన్ ఎక్కడ సభలు పెట్టినా జనం వస్తారు. ఇప్పుడు రాజకీయంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యాత్ర కాబట్టి… అదీ ఎన్నికలకు ముందు కాబట్టి జనం వస్తారు. గత ఎన్నికలకు ముందు కూడా ఇలాగే వచ్చారు. కానీ ఓట్లు రాలేదు. ఈ సారి ఓట్లు రాలేదు. పవన్ కల్యాణ్ సినిమా స్టార్ కావడం వల్ల ఆయన అభిమానులకు ఇతర రాజకీయ అభిప్రాయాలు బ లంగా ఉండటం వల్ల .. పవన్ రాజకీయంగా బలోపేతం కాలేకపోతున్నారు.
నిజానికి అధికార పార్టీ ఆయనను ఇంతగా టార్గెట్ చేసినా… తాను టార్గెట్ చేసిన ఓటు బ్యాంక్ ను ఏకీకృతం చేసుకోవడంలో పవన్ విఫలమవుతున్నారన్నది ఎక్కువ మంది అభిప్రాయం . అదే సమయంలో అలాంటి ప్రయత్నాల వల్ల ఇతర వర్గాలకు దూరం అవుతున్నారు. ఇంక ఆయనను రాజకీయంగా ఎదగకుండా చేయడానికి ఆయన చుట్టూ ఉన్న వందిమాగధులు … తమ వంతు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇది వైసీపీ కి ఆయుధంగా మారుతోంది. అందుకే… ఒంటరిగా పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ను వాలంటీర్ ను పెట్టి ఓడిస్తామని ధైర్యంగా చెబుతున్నారు. పవన్ కల్యాణ్ రెండో సారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోతే.. ఆయన సభలకు వచ్చే జనాలకు.. ఆయన పార్టీకి అర్థమే లేకుండా పోతుంది.