ఎన్నికల్లో ఓడితేనేం..రాజ్యసభలో ఉన్న బలంతో బీజేపీని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకున్న వైసీపీ పప్పులు ఉడకడం లేదు. రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరుగా వైసీపీని వీడుతుండటంతో జగన్ రాజకీయాలు బేలగా మారుతున్నాయి. పైగా.. కేంద్రంలో చంద్రబాబు కింగ్ మేకర్ గా ఉండటంతో వైసీపీకి బీజేపీతో దోస్తీ చేసే సందు కూడా దొరకడం లేదు. దీంతో వైసీపీకి సీన్ అర్థమైంది. టీడీపీ, జనసేనతోపాటు బీజేపీని కూడా శత్రుపార్టీల జాబితాలో చేర్చినట్టే కనిపిస్తోంది.
తిరుమల లడ్డూ వివాదంపై వైఎస్ జగన్ తోపాటు వైసీపీ నేతలపై బీజేపీ మహిళా నేత మాధవీలత చేసిన వ్యాఖ్యలకు తాజాగా పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. పక్కరాష్ట్రంలో ఉండేవారికి ఆంధ్రా రాజకీయాలు ఎందుకని ప్రశ్నించిన ఆయన…హిందువులపై అమితమైన ప్రేమను ఒలకబోస్తున్న తను ఆమె ఆస్పత్రిలో హిందువులకు బిల్లు తగ్గించారా అని నిలదీశారు. గతంలో అన్య మతస్తుడయిన ఏపీ గవర్నర్ … ప్రధాని మోడీతో పాటు తిరుమల వెళ్లారని అప్పుడు బీజేపీ నేతలు ఎందుకు ఆయనను ప్రశ్నించలేదని నిలదీశారు. అన్య మతస్తుడిని డిక్లరేషన్ ఇవ్వకుండా తిరుమలకు ఎందుకు తీసుకెళ్లారని మోడీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు పేర్ని నాని.
పేర్ని నాని తాజాగా చేసిన వ్యాఖ్యలతో బీజేపీని నేరుగా టార్గెట్ చేసినట్లు స్పష్టం అవుతోంది. తిరుమల లడ్డూ విషయంలో గత కొద్ది రోజులుగా బీజేపీ నేతల ప్రాపకం కోసం తెగ ప్రయత్నించి విఫలం కావడంతో.. ఇక ఆ పార్టీ నుంచి తమకు సహకారం దొరకదని ఫిక్స్ అయ్యారో ఏమో, ప్రధానిని కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ చేయడం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీని ప్రశ్నించడం ద్వారానైనా మరికొన్ని పార్టీల మద్దతు లభిస్తుందనే వ్యూహంతోనే ఆలస్యంగా ఈ విషయంలో ప్రధానిని వైసీపీ ఇన్వాల్వ్ చేసినట్టు ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.