శాసనమండలిలో అన్యమత ప్రచార అంశంపై వైసీపీ లోకేష్‌ను టార్గెట్ చేసింది. అన్యమత ప్రచారం అంశంపై చర్చలో.. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ నేరుగా నారా లోకేష్‌ను టార్గెట్ చేశారు. అన్యమత ప్రచారంలో లోకేష్ హస్తం ఉందని ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా లోకేష్ అన్యమత ప్రచారం చేయిస్తూ.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని లోకేష్ స్కెచ్ వేశారని ఆరోపించారు. తిరుమల కొండపై శిలువ ఉందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్ చేశారు. శిలువ లేకపోతే లోకేష్ రాజీనామా చేస్తారా అని వెల్లంపల్లి ప్రశ్నించారు.
టీటీడీ కొండపై శిలువ సోషల్ మీడియా క్రియేటివిటీనేనని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని టీడీపీ కుట్ర పన్నిందని మండిపడ్డారు. టీటీడీలో అన్యమత ప్రచారం జరిగిందనేది అవాస్తవమని తిరుమల వెంకటేశ్వరస్వామితో రాజకీయాలు చేయొద్దని హితవులు పలికారు. అయితే.. లోకేష్ ఈ ఆరోపణలకు దీటుగా బదులిచ్చారు. తనపై చేసి ఆరోపణలు రుజువు చేయకపోతే వెల్లంపల్లి రాజీనామా చేస్తారా? అని మంత్రికే లోకేష్ ప్రతి సవాల్ విసిరారు. మంత్రి చేసిన వ్యాఖ్యలు నిరూపించాల్సిందేనని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు.
శాసనమండలిలో తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఉంది. దాంతో.. ఎక్కువగా మంత్రులు మండలికి రావడం లేదు. పరిమితంగానే చర్చలు జరుగుతున్నాయి. అయితే.. చర్చలు కాస్త అర్థవంతంగానే జరుగుతున్నాయి. లోకేష్‌పై అసెంబ్లీలో ఆరోపణలు చేస్తున్న మంత్రులు.. మండలిలో పెద్దగా విమర్శలు చేయలేదు. కానీ వెల్లంపల్లి మాత్రం… అన్యమత ప్రచారం విషయంలో లోకేష్‌ను టార్గెట్ చేయడంతో.. సవాళ్లు ప్రతిసవాళ్లకు దారి తీసింది.