నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తర్వాత స్థానిక ఎన్నికలు వస్తాయని 90 శాతం సీట్లు గెల్చుకోవడానికి రెడీగా ఉండాలని… ఉత్తరాంధ్ర షాడో సీఎం విజయసాయి రెడ్డి గతంలో మీడియా ముఖంగానే ప్రకటించారు. అయితే ఆయన ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు వదిలేసి మరీ విశాఖలో మకాం వేసి.. పరిషత్, మున్సిపల్ ఎన్నికలు కూడా వెంటనే వచ్చేస్తాయి. అందరూ సిద్ధమవ్వాలని సన్నాహాక సమావేశాలు పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలని తొందర పెడుతున్నారు. ఇప్పుడల్లా ఎన్నికలు జరగవని చెప్పిన పెద్దమనిషి ఇప్పుడు ఎన్నికల పేరుతో హడావుడి చేస్తూంటే వైసీపీ నేతలు ఆశ్చర్యంతో చూస్తూండిపోతున్నారు.
ఒక్క విజయసాయిరెడ్డి మాత్రమే కాదు.. వైసీపీ నేతలు అందరూ పరిషత్, మున్సిపల్ ఎన్నికలకు రెడీ అయిపోయారు. మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు .. పంచాయతీ నాలుగో విడత ముగిసిన వెంటనే జరుగుతాయని ద్వితీయ శ్రేణి నేతలకు సమాచారం ఇచ్చి… దాని కోసం సిద్ధం కావాలని చెబుతున్నారు. నిజానికి జడ్పిటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు .. వెంటనే నిర్వహిస్తామని నిమ్మగడ్డ ఎప్పుడూ చెప్పలేదు. కానీ ఆయన దూకుడు చూసి ఎన్నికలు నిర్వహించే వెళ్తారని వైసీపీ నమ్ముతోంది. అందుకే రెడీ కావాలని పార్టీని సిద్ధం చేస్తున్నారు.
ప్రస్తుతం పరిషత్, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ మధ్యలో ఆగిపోయింది. ఆ ఎన్నికల్లో ఎన్నో అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు అందాయి. నిమ్మగడ్డ కూడా అవే వివరాలను అందిస్తూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఇప్పుడు వాటిని ఆయన ఏ మాత్రం సహించే పరిస్థితి లేదు. ఎక్కడ ఆపేశారో అక్కడ కొనసాగించే పరిస్థితి లేదని చెబుతున్నారు. ఒక వేళ నిమ్మగడ్డ అనుకుంటే.. మళ్లీ మొదటి నుంచి ప్రక్రియ ప్రారంభమవుతుంది. వైసీపీ కూడా ఇదే అనుకుంటోంది. గత నామినేషన్ల సంగతి పక్కన పెట్టి.. మళ్లీ మొదటి నుంచి ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని చెబుతోంది. పైకి మాత్రం ఎక్కడ ఆగిపోయాయో .. అక్కడ్నుంచే జరుగుతాయని చెబుతోంది.