సుమారు రెండేళ్ళు పూర్తి కావస్తున్నా కేంద్రప్రభుత్వం ఇంతవరకు విశాఖపట్నంలో రైల్వే జోన్ ఏర్పాటు చేయలేకపోయింది. త్వరలోనే దానిపై ప్రకటన వెలువడుతుందని భాజపా నేత పురందేశ్వరి చెప్పారు కానీ నిర్దిష్టంగా ఎప్పటిలోగా అనే విషయం చెప్పలేనని అన్నారు. కనుక త్వరలో అంటే ఎప్పటిలోగా ఎవరికీ తెలియదు. కనుక దీనికి వైకాపా డెడ్-లైన్ పెట్టింది. ఏప్రిల్ 13లోగా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించకపోయినయితే, ఏప్రిల్ 14న (డా. అంబేద్కర్ జయంతి) నుండి తమ పార్టీ విశాఖపట్నంలో ఆమరణ నిరాహార దీక్ష మొదలు పెడుతుందని ప్రకటించారు.
కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, స్థానిక ఎంపి మరియు విశాఖపట్నం భాజపా అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు, పురందేశ్వరి అందరూ కూడా మాటలు చెపుతున్నారే తప్ప రైల్వే జోన్ సాధించలేకపోతున్నారని అమర్ నాథ్ విమర్శించారు. అమర్ నాథ్ నేతృత్వంలో వైకాపా పార్టీ నేతలు, కార్యకర్తలు కలిసి స్థానిక డివిజనల్ రైల్వే కార్యాలయం వద్ద కొంత సేపు ధర్నా చేసిన తరువాత డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రలేఖ ముఖర్జీకి రైల్వే జోన్ ఏర్పాటు కోసం ఒక వినతి పత్రం సమర్పించారు.